- జనరల్ బాడీ మీటింగ్‌లో ఘటన
సిద్దిపేట, వెలుగు : సిద్దిపేట మున్సిపల్ సర్వ సభ్య సమావేశంలో కమిషనర్ ప్రసన్న రాణికి అవమానం జరిగింది. సమావేశంలో చైర్ పర్సన్, వైస్ చైర్మన్ తో పాటు మున్సిపల్ కమిషనర్ వేదికపై కూర్చోవాల్సి ఉండగా సోమవారం జరిగిన మీటింగ్‌లో ఆమెకు వేదిక కింద కుర్చీ వేసి కౌన్సిలర్లతో పాటు కూర్చోబెట్టారు. ఇటీవల మాజీ మంత్రి హరీశ్‌రావు బర్త్‌డే సందర్భంగా పట్టణంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను కమిషనర్ ఆదేశాల మేరకే సిబ్బంది తొలగించారని, అందుకే ఆమెను వేదికపై నుంచి దించి అవమానించినట్టు తెలుస్తోంది.
సిద్దిపేటలో బీఆర్ఎస్కు చెందిన పాలకవర్గం ఉండడంతో ఇలా చేశారని ప్రతిపక్ష కౌన్సిలర్లు అంటున్నారు. ప్రతీ సమావేశంలో కమిషనర్ వేదికపైనే కూర్చుని కౌన్సిలర్ల ప్రశ్నలకు సమాధానం ఇస్తుంటారు. కానీ, ఈ సమావేశంలో కౌన్సిలర్ల సీట్లకు ముందు కమిషనర్‌ను కూర్చోబెట్టడం వివాదానికి ఆజ్యం పోసింది. కాగా, ప్రతీ మీటింగ్ తర్వాత ఫొటోలు విడుదల చేసే మున్సిపల్ సిబ్బంది.. కమిషనర్ ప్రసన్నరాణి కింద కూర్చున్న ఫొటోలను మాత్రం రిలీజ్ చేయలేదు.
అవినీతిని అడ్డుకున్నందుకే..
మున్సిపాలిటీలో అవినీతిని అడ్డుకున్నందుకే కమిషనర్ ప్రసన్న రాణిని బీఆర్ఎస్ కౌన్సిలర్లు అవమానించారని బీజేపీ కౌన్సిలర్ కొత్తపల్లి రాధ ఆరోపించారు. సమావేశం తర్వాత ఆమె విలేకరులతో మాట్లాడుతూ సిద్దిపేట ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ప్రజాప్రతినిధులు వ్యవహరించడాన్ని బీజేపీ ఖండిస్తోందన్నారు. మహిళా మున్సిపల్ కమిషనర్ ను అవమానించిన బీఆర్ఎస్ కౌన్సిలర్లు క్షమాపణ చెప్పాలని పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు అత్తు ఇమామ్ డిమాండ్ చేశారు.