వర్క్– లైఫ్ బ్యాలెన్స్‌‌‌‌ కాన్సెప్ట్‌‌‌‌ నమ్మను : నారాయణ మూర్తి

  • వారానికి 70 గంటలు పని చేయాలి

న్యూఢిల్లీ: ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణ మూర్తి  వర్క్– లైఫ్ బ్యాలెన్స్ కాన్సెప్ట్‌‌‌‌ను  నమ్మనని కరాఖండీగా చెప్పేశారు. వారానికి 70 గంటలు పని చేయాలనే తన పాత కామెంట్స్‌‌‌‌ను పునరుద్ఘాటించారు. ఐటీ కంపెనీలు వారానికి ఆరు రోజుల  పని నుంచి ఐదు రోజులకు మారడంపై ఆయన ఆసంతృప్తి వ్యక్తం చేశారు. ‘వర్క్‌‌‌‌ లైఫ్ బ్యాలెన్స్‌‌‌‌పై నా అభిప్రాయాన్ని   కేవీ కామత్ 25 ఏళ్ల కిందట అడిగారు.  

ఇండియా పేద దేశం. మనం మొదట లైఫ్‌‌‌‌ గురించి ఆలోచించాలి. ఆ తర్వాత వర్క్‌‌‌‌–లైఫ్ బ్యాలెన్స్ గురించి ఆందోళన పడొచ్చు’ అని జియో ఫైనాన్షియల్ సర్వీసెస్‌‌‌‌ చైర్మన్ కేవీ కామత్‌‌‌‌తో జరిపిన చర్చ గురించి సీఎన్‌‌‌‌బీసీ టీవీ18 గ్లోబల్ లీడర్‌‌‌‌‌‌‌‌షిప్  సమ్మిట్‌‌‌‌లో నారాయణ మూర్తి మాట్లాడారు. ‘ప్రధాని మోదీ బహుశా వారానికి 100 గంటల పని చేస్తున్నారు. ఆయన కేబినెట్ మినిస్టర్లు,  అధికారులు కష్టపడుతున్నారు. 

వీరికి మన పని ద్వారానే కృతజ్ఞత తెలపగలం’ అని  వివరించారు.   1986 లో  వర్క్‌‌‌‌ వారానికి 6 రోజుల  నుంచి ఐదు రోజులకు మార్చినప్పుడు తనకు ఈ విధానం నచ్చలేదని, కష్టపడి పనిచేయడానికి ప్రత్యామ్నాయం ఏదీ లేదని  అన్నారు. బాగా తెలివైనవాడివైనా  కష్టపడి పనిచేయాల్సిందేనని  అన్నారు.