ఫోన్ ఎక్కువగా వాడడంతోనే తల్లిదండ్రులతో గొడవలు

  • పెద్దల్లో కంటే పిలల్లో  పెరిగిన అవగాహన: వివో సర్వే


హైదరాబాద్​, వెలుగు: అతిగా స్మార్ట్‌ఫోన్లు వాడితే  కలిగే  నష్టాలపై పెద్దల కంటే పిల్లలకే ఎక్కువ అవగాహన ఉందని వివో – సీఎంఆర్‌‌ సర్వే పేర్కొంది.  ఫోన్ ఎక్కువగా వాడడంతోనే తల్లిదండ్రులతో గొడవలు పెరుగుతున్నాయని 64 శాతం మంది పిల్లలు పేర్కొన్నారు.  ఫోన్లకు అడిక్ట్ అయ్యామని   64 శాతం  మంది పిల్లలు పేర్కొనగా,  సోషల్ మీడియా, ఎంటర్‌‌టైన్‌మెంట్‌ కోసమే ఎక్కువగా ఫోన్లు వాడుతున్నామని  వివరించారు. 

 తమ ఫ్రెండ్స్  సోషల్ మీడియా వాడకపోతే తాము కూడా వాడమని  66 శాతం మంది చెప్పారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే ప్రతీ ముగ్గురు పిల్లల్లో ఒకరు కొన్ని రకాల సోషల్ మీడియా యాప్స్ లేకుంటే బాగుండని భావిస్తున్నారు. దీనిని బట్టి  అతిగా ఫోన్లు వాడడం వలన కలిగే నష్టాలపై పెద్దల్లో కంటే పిల్లల్లో అవగాహన ఎక్కువుందని  అర్ధమవుతోంది. 

1,543 స్మార్ట్‌ఫోన్ యూజర్ల అభిప్రాయాలను సేకరించి  ‘స్విచాఫ్’ పేరుతో ఈ  సర్వేను వివో, సైబర్​ మీడియా రీసెర్చ్ (సీఎంఆర్)  చేశాయి.  మితిమీరిన స్మార్ట్ ఫోన్ వాడకంతో పిల్లలు, తల్లిదండ్రుల మధ్య బంధాలు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయని,  కానీ మెజార్టీ పిల్లలు, పెద్దలు  ఫ్యామిలీతో గడపడానికి క్వాలిటీ టైమ్ ఉంటే బాగుండని భావిస్తున్నారని ఈ సర్వే పేర్కొంది. కానీ, ఫోన్ వాడకాన్ని తగ్గించడానికి అటు పిల్లలు, ఇటు తల్లిదండ్రులు సిద్ధంగా లేరు. తల్లిదండ్రులు రోజుకు  సగటున  ఐదు గంటలకు పైగా స్మార్ట్‌ఫోన్‌లలో గడుపుతుంటే, పిల్లలు నాలుగు గంటలకు పైగా 
గడుపుతున్నారు.