2031 నాటికి మన ఎకానమీ విలువ 7లక్షల కోట్ల డాలర్లు!

  • ఏటా 6.7 శాతం పెరగనున్న జీడీపీ వెల్లడించిన క్రిసిల్​ ఏజెన్సీ

న్యూఢిల్లీ: మనదేశ ఆర్థిక వ్యవస్థ విలువ 2031 నాటికి ఏడు లక్షల కోట్ల డాలర్లకు చేరుతుందని రేటింగ్​ ఏజెన్సీ క్రిసిల్ ​వెల్లడించింది. దీని రిపోర్టు ప్రకారం..  భారతీయ ఆర్థిక వ్యవస్థ- 2025– 2031 ఆర్థిక సంవత్సరం మధ్య సగటున 6.7శాతం వృద్ధి చెందుతుంది. ఇది కరోనాకు పూర్వకాలంలో 6.6శాతం వృద్ధిని పోలి ఉంటుంది.  మనదేశ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి ఈ ఆర్థిక సంవత్సరం 6.8శాతం వరకు మధ్యస్థంగా ఉంటుందని అంచనా వేసింది. 2024 ఆర్థిక సంవత్సరంలో 8.2శాతం వృద్ధి సాధ్యపడింది.  

అధిక వడ్డీ రేట్లు,  కఠినమైన రుణ నిబంధనలు పట్టణ డిమాండ్‌‌‌‌ను తగ్గించడం ప్రారంభించాయి.  వినియోగదారుల ధరల సూచిక (సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం గత ఏడాది 5.4శాతం నుంచి 2025 ఆర్థిక సంవత్సరంలో సగటున 4.5శాతానికి తగ్గుతుందని అంచనా వేసింది.  ఆహార ద్రవ్యోల్బణం తగ్గుతుందని పేర్కొంది. వాతావరణం,  భౌగోళిక రాజకీయ అనిశ్చితులు ద్రవ్యోల్బణ అంచనాలకు అడ్డంకులు కావొచ్చు.  మనదేశ కరెంట్ ఖాతా లోటు 2024 ఆర్థిక సంవత్సరంలో 0.7శాతం నుంచి ఈ ఆర్థిక సంవత్సరం జీడీపీలో ఒకశాతానికి పెరగవచ్చని క్రిసిల్​ పేర్కొంది.

2024లో 7.2 శాతం వృద్ధి: మూడీస్ 

మనదేశ జీడీపీ 2024లో 7.2 శాతం పెరగవచ్చని మరో రేటింగ్​ ఏజెన్సీ మూడీస్​ పేర్కొంది. భారత ఆర్థిక వ్యవస్థ సానుకూలంగా ఉందని తెలిపింది. అయితే ద్రవ్యోల్బణం వల్ల ఆర్​బీఐ కఠినమైన ద్రవ్య విధానాన్ని కొనసాగించవచ్చని అంచనా వేసింది.  సమీప-కాలంలో ధరల్లో పెరుగుదల ఉన్నప్పటికీ, అధిక సాగు,  తగినంత ఆహార ధాన్యాల నిల్వలు, ఆహార ధరలు తగ్గుతున్నందున  రిటైల్ ద్రవ్యోల్బణం రాబోయే నెలల్లో రిజర్వ్ బ్యాంక్ లక్ష్యానికి అనుగుణంగా ఉంటుంది.  కూరగాయల ధరల పెరుగుదల కారణంగా రిటైల్ ద్రవ్యోల్బణం  ఈసారి14 నెలల గరిష్ట స్థాయి 6.21కి చేరుకుంది.  2024 రెండవ క్వార్టర్​లో మనదేశ వాస్తవ జీడీపీ వార్షికంగా 6.7 శాతం పెరిగిందని మూడీస్​ రిపోర్ట్​ వివరించింది.