పండుగ కాలంలో బండ్లకు భారీ గిరాకీ .. 42.88 లక్షల యూనిట్ల అమ్మకం

న్యూఢిల్లీ: ప్రస్తుత సంవత్సరంలో 42 రోజుల పాటు సాగిన ఫెస్టివల్ ​సీజన్​లో ఆటోమొబైల్ రిటైల్ అమ్మకాలు ఏడాది ప్రాతిపదికన 12 శాతం పెరిగి 42,88,248 యూనిట్లకు చేరుకున్నాయని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (ఫాడా) తెలిపింది. దీని రిపోర్టు ప్రకారం..   గత ఏడాది పండుగ కాలంలో మొత్తం  38,37,040 బండ్లు రిజిస్టర్​ అయ్యాయి. నవరాత్రి ప్రారంభమైనప్పటి నుంచి రిజిస్ట్రేషన్ల పెరుగుదల బాగుందని, గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి ఇవి 11.76 శాతం పెరిగాయని ఫాడా అధ్యక్షుడు విఘ్నేశ్వర్ తెలిపారు.  

ప్యాసింజర్ వాహనాల రిటైల్ గత ఏడాది ఇదే కాలంలో 5,63,059 యూనిట్లు ఉండగా, ఈ ఏడాది పండుగ కాలంలో 7 శాతం పెరిగి 6,03,009 యూనిట్లకు చేరుకున్నాయి.  ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు తిరిగి పుంజుకున్నాయని అన్నారు.  బెంగళూరు,  తమిళనాడులో అకాల భారీ వర్షాలు,  ఒడిశాలో తుఫాను రాకపోయి ఉంటే అమ్మకాలు 45 లక్షలు దాటి ఉండేవని విఘ్నేశ్వర్​ వివరించారు.