సర్కార్ స్కూళ్లలో మెరుగవుతున్న సౌలతులు

  •     మెదక్​జిల్లాలో రూ.20.62 కోట్ల విలువైన పనులు 
  •     సంగారెడ్డి జిల్లాలో రూ.27 కోట్లు రిలీజ్
  •     కలెక్టర్ల సుడిగాలి పర్యటనలు

మెదక్, సంగారెడ్డి, వెలుగు : పేదింటి పిల్లలు చదువుకునే సర్కార్​ స్కూళ్లలో సౌలత్​లు మెరుగవుతున్నాయి. అమ్మ ఆదర్శ పాఠశాల కార్యక్రమంలో భాగంగా ఎంపిక చేసిన స్కూల్స్​లో మౌలిక వసతులకు సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 2024 -, 25 అకాడమిక్​ ఇయర్​లో స్కూల్స్​​రీ ఓపెన్​కు వారం రోజుల ముందే చేపట్టిన పనులన్నీ పూర్తి చేసేలా కలెక్టర్, డీఈవో ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు.

గత బీఆర్ఎస్​ ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన మన ఊరు - మన బడి పథకం కింద ఎంపిక చేసిన స్కూల్స్​మినహాయించి అమ్మ ఆదర్శ పాఠశాల పథకం కింద జిల్లాలో ప్రైమరీ, అప్పర్​ ప్రైమరీ, జడ్పీ హైస్కూల్స్​ కలిపి మొత్తం  562 స్కూల్స్ సెలెక్ట్ చేశారు. ఆయా స్కూల్స్​లో తాగునీటి వసతి, ఎలక్ట్రిఫికేషన్​, మైనర్​ రిపేర్స్​, టాయిలెట్స్​ రినోవేషన్​, అర్బన్​ ఏరియాల్లోని గర్ల్స్​ స్కూళ్లలో టాయిలెట్స్​ రినోవేషన్​ పనులు చేపట్టారు. 

50 శాతం నిధులు విడుదల

అమ్మ ఆదర్శ పాఠశాల కార్యక్రమం కింద ఎంపిక చేసిన స్కూళ్లలో​నిర్దేశిత పనులు చేసేందుకుగాను రూ.20.62 కోట్లు అవసరమవుతాయని అంచనా వేశారు. ఈ మేరకు ఇప్పటి వరకు రెండు విడతల్లో 50 శాతం నిధులు రూ.9.85 కోట్లు విడుదలయ్యాయి. సెల్ఫ్​హెల్ప్​గ్రూప్​ అధ్యక్షుడు, చైర్​ పర్సన్లుగా, స్కూల్​హెడ్​ మాస్టర్లు కన్వీనర్లుగా ఉన్న అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఆధ్వర్యంలో సంబంధిత అన్ని స్కూళ్లలో​నిర్దేశిత పనులు చకచకా సాగుతున్నాయి. జూన్​ 12న స్కూల్స్​ రీ ఓపెన్​ కానుండగా, 5వ తేదీలోగా అమ్మ ఆదర్శ పాఠశాల కార్యక్రమంలో చేపట్టిన పనులన్నీ పూర్తి చేయాలని కలెక్టర్​టార్గెట్​పెట్టారు.

ఈ మేరకు పంచాయతీ రాజ్, ఇంజనీరింగ్ విభాగం, ఇరిగేషన్​ అధికారులు, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు యుద్ద ప్రాతిపదికన పనులు పూర్తి చేయడంపై దృష్టి పెట్టాయి. ఇప్పటి వరకు జిల్లాలో సుమారు 150 స్కూల్స్​లో దాదాపు 90 శాతం పనులు పూర్తయినట్టు సంబంధిత అధికారులు చెబుతున్నారు. కలెక్టర్​ రాహుల్​ రాజ్, డీఈవో రాధాకిషన్​తరచూ స్కూల్స్​ ను తనిఖీ చేస్తూ అమ్మ ఆదర్శ పాఠశాల పనులను పర్యవేక్షిస్తున్నారు. పనులు నాణ్యతగా చేయడంతోపాటు త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత డీఈ, ఏఈలను ఆదేశిస్తున్నారు. 

సంగారెడ్డి జిల్లాలో నాణ్యత లోపం..

సంగారెడ్డి జిల్లాలో మొత్తం 756 స్కూళ్లలో పనులు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు జిల్లాకు రూ.27 కోట్లు రిలీజ్ చేసినట్టు అధికార వర్గాలు తెలిపాయి. అయితే పనులు  స్వయం సహాయక సంఘాల పర్యవేక్షణలో కొనసాగాలి గానీ పనులు త్వరగా జరగకపోవడం వల్ల చాలా చోట్ల కాంట్రాక్టర్లతో చేయిస్తున్నారు. ఇదే అదనుగా కాంట్రాక్టర్లు తమ చేతివాటం చూపిస్తూ నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా పనులు చేస్తున్నారు. సంగారెడ్డి టౌన్ లోని మార్క్స్ నగర్ స్కూల్లో నీటి నిల్వ కోసం నిర్మించిన సంపు చుట్టూ సిమెంట్ బీటలు వారి లీకేజీ అవుతున్నాయి.

ప్రస్తుతం దానికి రెండోసారి రిపేర్​పనులు చేస్తున్నారు. అలాగే ఇదే స్కూల్లో టాయిలెట్స్ అధ్వాన్న స్థితిలో ఉన్నా వాటికి కనీసం రిపేర్లు మొదలుపెట్టలేదు. నీటి కుళాయిలు అసంపూర్తిగా వదిలేశారు. రాజంపేట లోని ఉర్దూ పాఠశాలలో నీటి కులాయి, బాత్రూంలకు రిపేర్ పనులు ఇటీవల మొదలుపెట్టారు. వాటర్ ట్యాంక్ చుట్టూ రక్షణ గోడ కట్టడం వంటి పనులు నడుస్తున్నాయి.

కొన్ని స్కూళ్లలో పనులు స్లోగా నడుస్తున్నాయని జిల్లా కలెక్టర్ క్రాంతికి ఫిర్యాదులు అందడంతో ఆమె పనుల పురోగతిపై సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. జూన్ 12న కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం అవుతున్న నేపథ్యంలో పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.