- పగలు తవ్వుతూ.. రాత్రి పూట తరలిస్తూ అక్రమ దందా
- కొన్నిచోట్ల గాడిదల మీద చేరవేస్తున్న అక్రమార్కులు
మెదక్/ పాపన్నపేట, వెలుగు: అక్రమార్కులు మంజీరా నది, హల్దీ వాగు నుంచి అక్రమంగా ఇసుక తరలించి సొమ్ముచేసుకుంటున్నారు. పగటి పూట జేసీబీలతో ఇసుక తవ్వి డంప్ చేసుకొని రాత్రి వేళ తరలిస్తున్నారు. పాపన్నపేట మండలం చుట్టూ మంజీరా నది ప్రవహిస్తుంది. మెజార్టీ గ్రామాలు నది వెంటే ఉంటాయి. నదిలో నాణ్యమైన ఇసుక పుష్కలంగా ఉంది. దీంతో అక్రమార్కులు ఇసుక దందాను కొనసాగిస్తున్నారు. కొన్ని రోజులుగా మండలంలోని ఎన్కెపల్లి , చిత్రియాల్, గాజులగూడెం, గాంధారిపల్లి, ఆరెపల్లి, కుర్తివాడ గ్రామాల పరిధిలో అక్రమ ఇసుక రవాణా జోరుగా సాగుతోంది.
కొంతమంది ముఠాగా ఏర్పడి పగటి పూట మంజీరా నది నుంచి ఇసుక తవ్వి గ్రామ శివారులో డంప్ చేస్తున్నారు. రాత్రి కాగానే, ట్రాక్టర్ల ద్వారా ఇతర ప్రాంతాలకు తరలిస్తూ అమ్ముకుంటున్నారు. అక్రమ ఇసుక రవాణాను అరికట్టాల్సిన అధికారులే పరోక్షంగా అక్రమార్కులకు సపోర్ట్ చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఇంటి నిర్మాణం కోసం ఒక ట్రిప్పు ఇసుక తెచ్చుకుందామంటే అనేక నిబంధనలు పెడుతున్న అధికారులు, అక్రమార్కులు ఎలాంటి అనుమతి లేకుండా వందల ట్రాక్టర్ల ఇసుక తరలిస్తున్నా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయ. అప్పుడప్పుడు నామమాత్రంగా దాడులు చేసి నాలుగైదు ట్రాక్టర్లను పట్టుకుని జరిమానా విధించి వదిలేస్తున్నారని అంటున్నారు. రోజుల తరబడి పదుల సంఖ్యలో ట్రాక్టర్ల ద్వారా వందలాది ట్రిప్పుల ఇసుక తరలిస్తున్న వారిపై చర్యలు లేకపోవడం అనుమానాలకు తావిస్తోంది.
గాడిదల మీద తరలిస్తున్రు..
ట్రాక్టర్లలో ఇసుక తరలిస్తే అందరికీ తెలిసి దొరికి పోతామని కొందరు కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. సంచుల్లో ఇసుక నింపి పదుల సంఖ్యలో గాడిదల మీద తరలిస్తున్నారు. ఆరెపల్లిలో గాడిదలపై ఇసుక రవాణా సాగుతోంది. ఇసుక కావాలనుకున్న వారికి గాడిదల మీద ఇసుక తీసుకెళ్లి వారు చెప్పిన చోట పోస్తున్నారు.
కొల్చారం మండలంలో..
కొల్చారం మండలంలో సైతం మంజీరా నది నుంచి అక్రమ ఇసుక రవాణా సాగుతోంది. తుక్కాపూర్, పైతర గ్రామాల పరిధిలో రాత్రి పది గంటల తరువాత ట్రాక్టర్లు నదిలోకి దిగుతున్నాయి. అక్కడి నుంచి ఇసుక తరలించి గ్రామాల శివార్లలో ఖాళీ స్థలంలో డంప్ చేస్తున్నారు. ఇలా డంప్ చేసిన ఇసుకను ట్రాక్టర్లు, లారీల్లో తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. టాస్క్ ఫోర్స్ ఆఫీసర్లు దాడులు చేసి ట్రాక్టర్లు సీజ్ చేసినపుడు కొద్ది రోజులు బంద్ చేసి ఆ తర్వాత యధావిధిగా అక్రమ దందా సాగిస్తున్నారు.
పట్టా పొలాల్లోంచి సైతం..
మెదక్ పట్టణ శివారులో పట్టా పొలాల్లో నుంచి అక్రమ ఇసుక రవాణా జోరుగా సాగుతోంది. పుష్పాల వాగులో నుంచి ఇసుక రవాణా చేసే వారే, సమీపంలోని పట్టా పొలాల్లో నుంచి సైతం జేసీబీల సాయంతో ఇసుక తవ్వి తరలిస్తున్నారు. కొన్నిచోట్ల పెద్ద మొత్తంలో మట్టిని తవ్వి ఫిల్టర్ చేసి అందులో నుంచి ఇసుకను తీసి అమ్ముకుంటున్నారు.
మా దృష్టికి రాలేదు..
మండలంలో అక్రమంగా ఇసుక రవాణా జరుగుతున్నట్టు మా దృష్టికి రాలేదు. మంజీరా నది నుంచి ఎవరైనా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. మండలంలో ఏ గ్రామాల వారికి ఇసుక పర్మిషన్ ఇవ్వలేదు. గతంలో ఫిర్యాదులు రాగా, ఇసుక సీజ్ చేసి కేసులు నమోదు చేశాం. ఎక్కడి నుంచైనా అక్రమంగా ఇసుక తరలిస్తున్నట్లు సమాచారం ఇస్తే చర్యలు తీసుకుంటాం.
- లక్ష్మణ్ బాబు, పాపన్నపేట తహసీల్దార్