బాసర, వెలుగు: రోజుకు రూ.480 ఇచ్చే వేతనాన్ని తగ్గించి కేవలం రూ.270 ఇస్తూ తమతో వెట్టి చాకిరి చేయిస్తూ శ్రమ దోపిడీకి పాల్పడుతున్నా రని బాసర ట్రిపుల్ ఐటీ కార్మికులు ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ ముందు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం బాసరలో కార్యక్రమం ముగించుకొని వెళ్తున్న ఎమ్మెల్యేకు ట్రిపుల్ఐటీ మెయిన్ గేటు వద్ద ఆపి గోడు వెళ్లబోసుకున్నారు.
180 మంది కార్మికులు ఉండాల్సిన చోట కేవలం 120 మందితో పనులు చేయించుకుంటున్నారని, ప్రశ్నిస్తే సస్పెండ్ చేస్తామని బెదిరిస్తున్నారని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. నెలలో 22 రోజులు పనిచేస్తే తమకు రూ.5వేలు మాత్రమే వస్తున్నాయన్నారు. ఏండ్ల తరబడి కొందరికి పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించడం లేదన్నారు.
స్పందించిన ఎమ్మెల్యే.. వర్సిటీ వైస్ ఛాన్సలర్ రాగానే సమస్యలపై ఆయనతో మాట్లాడతానని, న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. అంతకుముందు ఎమ్మెల్యే బాసరలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.