అంకెల గారడీ కాదు .. ఇది ప్రజా బడ్జెట్: భట్టి

  • బీఆర్​ఎస్​లాగా పాలనను గాలికి వదిలేయం
  • నిత్యం ప్రజల్లోనే ఉంటున్నంఓఆర్​ఆర్​ను అమ్మేసిన్రు.. 
  • చాన్స్​ దొరికితే హైటెక్​ సిటీని  కూడా అమ్మేసెటోళ్లు
  • అసాధ్యమనుకున్న రుణమాఫీని చేసి చూపిస్తున్నం
  • ఉద్యోగాలే కాదు.. ప్రిపేర్​ అయ్యేందుకు కోచింగ్​ ఇస్తం
  • ప్రతి నియోజకవర్గంలో అంబేద్కర్​ నాలెడ్జ్​ సెంటర్లు పెడ్తామని వెల్లడి
  • అసెంబ్లీలో బడ్జెట్​పై చర్చకు రిప్లై

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర బడ్జెట్​లో అంకెల గారడీ గానీ, భ్రమలు గానీ ఏమీలేవని డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క అన్నారు. అన్నివర్గాల అభ్యు న్నతి కోసం, హామీల అమలు కోసం ఉన్నది ఉన్నట్టుగా జాగ్రత్తగా కూర్పు చేశామని తెలిపారు. ‘‘ఇది ప్రజా బడ్జెట్. ప్రోగ్రెసివ్​ బడ్జెట్​. అత్యంత సామాన్యుడికి కూడా అర్థమయ్యేలా సరళమైన భాషలో ప్రవేశపెట్టాం. అన్నివర్గాలకూ ప్రాధాన్యమిచ్చాం” అని పేర్కొన్నారు. 

గత బీఆర్​ఎస్​ సర్కార్​ పాలనను గాలికి వదిలేసినట్టు తాము గాలికి వదిలేయబో మని, ఇచ్చిన హామీలను అమలు చేసి చూపిస్తా మని స్పష్టం చేశారు. ఐదేండ్లు ఆషామాషీగా గడిపేందుకు తాము అధికారంలోకి రాలేదని, ప్రజలకు సేవ చేయడానికి వచ్చామని చెప్పారు. ‘‘ఐదేండ్లే కాదు.. పదేండ్లపాటు.. ఆ తర్వాత పదేండ్ల పాటూ అధికారంలో ఉంటాం” అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. బీఆర్​ఎస్​ లాగా సెక్రటేరియెట్​ ఎక్కడుందో కూడా తెలియనంతగా పాలనను సాగించబోమని, నియోజకవర్గాలకు వెళ్లి నిత్యం ప్రజల్లో ఉంటున్నామని తెలిపారు.  శనివారం అసెంబ్లీలో బడ్జెట్​పై చర్చ సందర్భంగా భట్టి విక్రమార్క రిప్లై ఇచ్చారు.

‘‘పదేండ్లు అధికారంలో ఉన్న బీఆర్​ఎస్​ పార్టీ హామీలను అమలు చేయలేదు. వదిలేసి వెళ్లిపోయింది. మేం వచ్చి 8 నెలలు కూడా కాలేదు. అందులోనూ 3 నుంచి 4 నెలలు ఎన్నికల కోడ్​తోనే సరిపోయింది. అంటే ఎనిమిది నెలల్లో పాలనకు దక్కింది నాలుగు నెలలే. అయినాగానీ ప్రజల కోసం ఆలోచించి అనేక పథకాలను అమలు చేశాం” అని భట్టి తెలిపారు. 

బడ్జెట్​ వాస్తవికతకు దూరంగా ఉందని హరీశ్​రావు అంటున్నారని.. సభలో చాలా సీనియర్​ నాయకుడై ఆర్థిక మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న హరీశ్​రావు కూడా ఏదీ తెలియనట్టే మాట్లాడటం ఏమిటని మండిపడ్డారు. బడ్జెట్​పై నిర్మాణాత్మక సూచనలు చేస్తారనుకుంటే.. లేచిందే మొదలు ప్రభుత్వంపై దాడి మొదలు పెట్టారని ఫైర్​ అయ్యారు.  ‘‘ప్రతి బడ్జెట్​లోనూ బడ్జెట్​ ఎస్టిమేట్స్​కు, యాక్చువల్​గా ఖర్చు పెట్టినదానికి గత బీఆర్​ఎస్​ ప్రభుత్వం కనీసం 25 శాతం దాకా గ్యాప్​ పెట్టుకుంటూ వెళ్లింది. 

గత బడ్జెట్​లో వాళ్లు రూ.2.90 లక్షల కోట్ల బడ్జెట్​ పెడితే.. కేవలం రూ.2.31 లక్షల కోట్లే ఖర్చు పెట్టారు. ఇది రికార్డులు చెప్తున్న మాట. వాళ్ల లాగే మేం గ్యాప్​ ఎక్కువ పెట్టాలనుకుని ఉంటే.. బడ్జెట్​ను రూ.3.5 లక్షల కోట్ల దాకా పెట్టి ఉండాలి. కానీ, మేం రియలిస్టిక్​గా ఆలోచించి రూ.2.91 లక్షల కోట్ల బడ్జెట్​ పెట్టాం. మేమేమీ బడ్జెట్​ను గాలికి పెట్టలేదు’’ అని ఆయన పేర్కొన్నారు. ‘‘వెన్నుపోటు, మోసం గురించి బీఆర్​ఎస్​ వాళ్లు మాట్లాడితే జనం నవ్వుకుంటారు. బీఆర్​ఎస్​ అంటేనే మోసం.. కాంగ్రెస్​ అంటే నమ్మకం అన్నది జనం విశ్వాసం. అనవసరంగా మీరు(బీఆర్​ఎస్​) మార్టిన్​ లూథర్​ కింగ్​ పేరెత్తి ఆయన్ను అవమానపరచొద్దు’’ అని అన్నారు.

రైతుల బాధలు తీరుస్తం

వ్యవసాయ రంగాన్ని బాగు చేసుకునేందుకు రూ.72,659 కోట్లు బడ్జెట్​లో పెట్టామని,  రైతుల బాధలను తీర్చేందుకు లోతుగా అధ్యయనం చేసి ఈ బడ్జెట్​ను పెట్టామని భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్రానికి తలమానికమైన హైదరాబాద్​ అభివృద్ధి కోసం, మున్సిపల్​ డెవలప్​మెంట్​ కోసం రూ.15 వేల కోట్లను కేటాయించామని.. అందులో హైదరాబాద్​ కోసం రూ.10 వేల కోట్లు పెట్టామని చెప్పారు. గత ప్రభుత్వాలు ప్రవేశపెట్టలేనంతగా నభూతో నభవిష్యత్​ అనేలా హైదరాబాద్​ అభివృద్ధికి నిధులు కేటాయించామని వివరించారు. కానీ, ఏదీ తెలియనట్లు హరీశ్​ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. 

ఇందిరమ్మ రాజ్యంలో ఎస్సీ, ఎస్టీల సంక్షేమం కోసం భారీగా నిధులు కేటాయించామని భట్టి  అన్నారు. గత పదేండ్ల బీఆర్​ఎస్​ పాలనలో ఎస్సీ, ఎస్టీ సబ్​ప్లాన్​ను మరిచిపోయారని.. తాము మాత్రం ఎస్సీ, ఎస్టీలకు దామాషా ప్రకారం ఈ చట్టం ద్వారా ఎన్ని నిధులొస్తాయో చేసి చూపిస్తున్నామని చెప్పారు. జనాభాలో సగం మంది ఉన్న మహిళల కోసం ఇందిరా క్రాంతి పథకాన్ని నాటి కాంగ్రెస్​ ప్రభుత్వం తీసుకొస్తే ఆ పథకాన్ని గత బీఆర్​ఎస్​ ప్రభుత్వం పదేండ్లలో నీరుగార్చిందని మండిపడ్డారు.

 పావలా వడ్డీ కాదు కదా అసలు రుణాలే ఇవ్వలేదని ఫైర్​ అయ్యారు. ఇప్పుడు కాంగ్రెస్​ ప్రభుత్వం వచ్చాక కోటి మంది మహిళలను లక్షాధికారులను చేసేలా బడ్జెట్​లో పద్దు పెట్టాలని సీఎం రేవంత్​ రెడ్డి కేబినెట్​లో చర్చించి చెప్పారని,  అందులో భాగంగా ఏడాదికి రూ.20 వేల కోట్లను మహిళలకు వడ్డీలేని రుణాలిస్తామని తెలిపారు.  

మీ హామీలు నెరవేర్చారా?

ఆరు గ్యారంటీల గురించి బీఆర్​ఎస్​ నేతలు మాట్లాడుతున్నారని, కానీ.. గత బీఆర్​ఎస్​ ప్రభుత్వం ఇచ్చిన హామీలను పదేండ్లలో  నెరవేర్చిందా? అని భట్టి విక్రమార్క ప్రశ్నించారు. ‘‘ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నారు. ఇచ్చారా? దళితులకు మూడెకరాల  భూమి ఇస్తామన్నారు.. ఇచ్చారా? ప్రతి మండలంలోనూ అబ్బాయిలు, అమ్మాయిలకు సెపరేట్​గా రెసిడెన్షియల్​ స్కూళ్లు కట్టిస్తామన్నారు.. కట్టారా? ఎన్నో చెప్పారు. ఏమీ చేయలేదు. కానీ, మేం అధికారంలోకి వచ్చీరాగానే.. అరగంటలోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ స్కీమ్​ను ప్రారంభించాం. 

ఆరోగ్యశ్రీని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచాం. ఆరు గ్యారంటీలను కచ్చితంగా అమలు చేస్తాం. వాటిని అమలు చేసేందుకు నిరంతరం పనిచేస్తున్న మంత్రివర్గం మాది. నియోజకవర్గాలకు వెళ్లి నిత్యం ప్రజల్లో ఉంటున్నాం. కానీ, వాళ్లలాగా(బీఆర్​ఎస్​ నేతలలాగా) సెక్రటేరియెట్​ ఎక్కడుందో కూడా తెలియనంతగా మేం చేయడం లేదు. వాళ్ల పాలనలో మంత్రుల చాంబర్​ ఎక్కడుందో తెలియదు.. సెక్రటరీలు ఎక్కడుండేవాళ్లో తెలియదు.

 అసలు పదేండ్లు పాలన ఎలా చేశారు? కనీసం ఒక్క రివ్యూ అయినా చేశారా? కానీ, మా పాలన చూడండి. మేం పది గంటలకే సెక్రటేరియెట్​కు వెళ్తున్నాం. అధికారులతో నిత్యం రివ్యూలు చేస్తున్నాం. పరుగులు పెట్టిస్తూ పాలన నడిపిస్తున్నాం’’ అని ఆయన చెప్పారు. వైన్స్​టైండర్ల కోసం ఏడాది గడువుకు ముందే అప్లికేషన్లు అమ్ముకున్న చరిత్ర బీఆర్​ఎస్​ది అని మండిపడ్డారు.బీఆర్​ఎస్​లాగా ఖజానాకు గండి కొట్టాబోమని, ఆదాయం పెంచుతామని చెప్పారు. విభజన హామీలను కేంద్ర బడ్జెట్​లో పెట్టని విషయంపైనే అసెంబ్లీ తీర్మానం చేశాం తప్ప.. సెంట్రల్లీ స్పాన్సర్డ్​ స్కీమ్స్​పై కాదని తెలిపారు. గత సర్కార్​ చాలా వరకు సెంట్రల్​ నిధులను పక్కదోవ పట్టించిందని, మరికొన్నింటికి స్టేట్​ షేర్​ ఇవ్వలేదని, కానీ, తాము రాష్ట్ర వాటానూ ఇస్తామని,  సెంట్రల్​ నిధులను తీసుకొస్తామని చెప్పారు. 

ప్రజలకు ఇండ్ల కోసం ఎమ్మెల్యేలు లిస్టు ఇవ్వాలి

పదేండ్లలో బీఆర్​ఎస్​ ప్రభుత్వం ప్రజలకు ఎన్ని ఇండ్లు ఇచ్చిందని భట్టి నిలదీశారు. ‘‘రాష్ట్రంలో 4.50 లక్షల ఇండ్లు కట్టించేందుకు నిర్ణయించాం. విధివిధానాలు నిర్ణయించేలోగానే ఎన్నికల కోడ్​ వచ్చింది. ఎన్నికలవ్వగానే మళ్లీ ఆ ప్రాసెస్​ను మొదలుపెట్టాం. ఎమ్మెల్యేలంతా తమ తమ నియోజకవర్గాల్లో ఇండ్లు లేని అత్యంత పేదల లిస్టును తయారు చేసి ఇన్​చార్జ్​ మంత్రికి ఇవ్వండి. ఈ రాష్ట్రంలో ఏ ఒక్కరూ ఇల్లు లేకుండా ఉండకూడదన్నదే మా ప్రభుత్వ లక్ష్యం. 

ఎంత ఖర్చైనా పేదలకు మేం ఇండ్లు కట్టించి ఇస్తాం’’ అని ఆయన వెల్లడించారు. రైతుభరోసాపై ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించామని, నూటికినూటిపాళ్లు అమలు చేసి తీరుతామని చెప్పారు. రాష్ట్రంలో ప్రజలపై పన్నుల భారం వేయబోమని భట్టి స్పష్టం చేశారు. ‘‘ఎల్​ఆర్​ఎస్​ కు సంబంధించి 25 లక్షల అప్లికేషన్లు పెండింగ్​లో ఉన్నాయి. ఫ్లాట్లు రిజిస్ట్రేషన్లు కాకుండా పేదలు, మధ్యతరగతి వాళ్లు ఇబ్బంది పడుతున్నారు. 

వాళ్ల దగ్గర్నుంచి గత సర్కార్​ అప్లికేషన్​ ఫీజులు వసూలు చేసి వదిలేసింది” అని చెప్పారు. హైదరాబాద్​లో న్యూ సిటీనే కాకుండా ఓల్డ్​ సిటీని కూడా అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో ముందుకెళ్తున్నామన్నారు. కొందరు సభ్యులు విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. అందరి శ్రేయస్సునూ దృష్టిలో ఉంచుకుని తమ ప్రభుత్వం నిధులను కేటాయించిందన్నారు. రేషన్​ కార్డులపై ఇప్పటికే కేబినెట్​ సబ్​ కమిటీ వేశామని, సబ్​ కమిటీ నిర్ణయాల మేరకు రేషన్​కార్డులను జారీ చేస్తామని భట్టి విక్రమార్క తెలిపారు. 

పాత ప్రాజెక్టులను పునరుద్ధరిస్తం

మేడిగడ్డ బ్యారేజీ నుంచి గత ప్రభుత్వం పైకి లిఫ్ట్​ చేసిన నీళ్ల కన్నా సముద్రంలోకి వదిలిన నీళ్లే ఎక్కువని భట్టి విక్రమార్క అన్నారు. కాకతీయ కెనాల్​ నుంచి సూర్యాపేట వరకు వస్తున్న నీళ్లు కాళేశ్వరం నీళ్లు కాదని, కాంగ్రెస్​ ప్రభుత్వం కట్టిన శ్రీపాద ఎల్లంపల్లి నుంచి వచ్చే నీళ్లని ఆయన చెప్పారు. కాంగ్రెస్​ ప్రభుత్వం కట్టిన కాల్వల ద్వారా మిడ్​ మానేరు, దేవాదుల లిఫ్ట్​ ఇరిగేషన్​ ప్రాజెక్టు ద్వారా నీళ్లు వెళ్తున్నాయని తెలిపారు. 

కానీ, బీఆర్​ఎస్​ వాళ్లు మాత్రం కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి వస్తున్నాయంటూ సంబురాలు చేసుకుంటున్నారని ఆయన దుయ్యబట్టారు. తమ ప్రభుత్వం ప్రాధాన్య ప్రాజెక్టులకే నిధులను కేటాయించిందని, వచ్చే బడ్జెట్​ నాటికి ఈ ప్రాజెక్టుల ద్వారా లక్షల ఎకరాలకు నీళ్లు పారుతుంటాయని అన్నారు. బడ్జెట్​లో అప్పులు కట్టగాపోనూ క్యాపిటల్​ ఇన్వెస్ట్​మెంట్​ కోసం నిధులు కేటాయించామని చెప్పారు.

చిన్న తప్పు చేసినా హైడ్రా ఊరుకోదు

లా అండ్​ ఆర్డర్​ను ప్రభుత్వం ప్రాధాన్యంగా తీసుకున్నదని భట్టి విక్రమార్క చెప్పారు. హైదరాబాద్​ పోతే చాలు.. హాయిగా బతకొచ్చు అనేలా సిటీని తీర్చుదిద్దుతామన్నారు. హైదరాబాద్​లో బీఆర్​ఎస్​ హయాంలోనే ఎక్కువ మర్డర్లు జరిగాయని,  2023లో 48 హత్యలు జరిగాయని చెప్పారు. హైదరాబాద్​లో చిన్న తప్పు చేసినా హైడ్రా చూస్తూ ఊరుకోదని, వెంటనే పట్టుకొచ్చేస్తుందని ఆయన స్పష్టం చేశారు.  ‘‘2014 నుంచి ఇప్పటివరకు ఎన్ని చెరువులు కబ్జా అయ్యాయి.. ఎవరెవరు ఆక్రమించారన్న లెక్కను హైడ్రా తీస్తుంది” అని ఆయన హెచ్చరించారు. ‘‘నేరస్తులారా జాగ్రత్త. హైడ్రా వస్తుంది. మీ పని పడుతుంది. సిటీ వదిలి వెళ్లిపోండి’’ అంటూ హెచ్చరించారు. 

ఓఆర్​ఆర్​నూ అమ్మేసిన్రు

హైదరాబాద్​లో బీఆర్​ఎస్​ పదేండ్ల పాలనలో వచ్చిన పెట్టుబడులేంటని భట్టి విక్రమార్క ప్రశ్నించారు. భూతద్దాలు పెట్టుకుని చూసినా కనిపించదన్నారు. ‘‘హైదరాబాద్​ అభివృద్ధికి గత కాంగ్రెస్​ ప్రభుత్వాలు ఎంతో కృషి చేశాయి. ఎన్నో ప్రభుత్వ రంగ సంస్థలను తీసుకొచ్చాయి. అందుకే హైదరాబాద్​ ఎదిగింది” అని తెలిపారు. ‘‘హుస్సేన్​సాగర్​ను స్వచ్ఛమైన కొబ్బరినీళ్లలాగా మారుస్తామని గత బీఆర్​ఎస్​ పాలకులు చెప్పారు.. చేశారా?” అని ఆయన నిలదీశారు. 

భవిష్యత్​ దూరదృష్టితో కాంగ్రెస్​ అన్ని కట్టిస్తే.. గత బీఆర్​ఎస్​ సర్కార్​ అమ్మేసుకుందని మండిపడ్డారు. ‘‘ఓఆర్​ఆర్​ను గత బీఆర్​ఎస్​ ప్రభుత్వం అమ్మేసింది. ఏ ఏడాదికి ఆ ఏడాది ఆదాయం వచ్చేలా ట్యాక్సులు వసూలు చేసుకుంటారు. కానీ, ఒకేసారి ఎవరైనా 30 ఏండ్ల ట్యాక్స్​లు వసూలు చేసేసి వాళ్లకు అప్పగించేస్తారా? చాన్స్​ దొరికితే హైటెక్​ సిటీనీ వాళ్లు(బీఆర్​ఎస్​) అమ్మేసేటోళ్లు’’ అని వ్యాఖ్యానించారు. తాము అధికారంలోకి వచ్చాక చాలా నాణ్యమైన కరెంట్​ను అందిస్తున్నామని భట్టి విక్రమార్క చెప్పారు. సూర్యాపేటలో కేసీఆర్​ మీటింగ్​లో జనరేటర్​ కట్​ అయి పవర్​ పోతే కరెంట్​ కట్​ అయిందంటూ బీఆర్​ఎస్​ మీడియా తప్పుడు ప్రచారం చేసిందని ఆయన ఫైర్​ అయ్యారు. ‘‘ఓసారి మహబూబ్​నగర్​లో శ్రీనివాస్​ గౌడ్​ ఇంటికి వెళ్తే.. కరెంట్​ పోయిందంటూ స్వయంగా కేసీఆరే తప్పుడు ట్వీట్​ చేశారు” అని విమర్శించారు.

ఇటు ఉద్యోగాలు..అటు కోచింగ్​

రాష్ట్రాన్ని తెచ్చుకున్నది ఉద్యోగాల కోసమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. 4 నెలలు మోడల్​ కోడ్​పోనూ ఈ నాలుగు నెలల పాలనా కాలంలోనే 32,410 ఉద్యోగాలిచ్చామని తెలిపారు. ఇంకో 35 వేల ఉద్యోగాలకు పరీక్షలను నిర్వహించా మని, నియామక ప్రక్రియ నడుస్తున్నదని ఆయన చెప్పారు. 

ఈ 4 నెలల్లోనే దాదాపు 65 వేల ఉద్యోగాలను ఇచ్చామన్నారు. కేవలం ఉద్యోగాలను ఇవ్వడమే కాకుండా   నిరుద్యోగులకు పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ అందించేలా అంబేద్కర్​ నాలెడ్జ్​ సెంటర్​ను ఏర్పాటు చేయాలని నిర్ణయించామని,  నిరుద్యోగ యువత కోచింగ్​ కోసం హైదరాబాద్​ వరకు రావాల్సిన అవసరం లేకుండా ప్రతి నియోజకవర్గంలో నూ ఈ అంబేద్కర్​ నాలెడ్జ్​ సెంటర్లను పెడతామని వెల్లడించారు.  

రుణమాఫీ విప్లవాత్మక నిర్ణయం

రైతు రుణమాఫీ విప్లవాత్మక నిర్ణయమని భట్టి అన్నారు. ‘‘రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని మేం చెబితే.. బీఆర్​ఎస్​ వాళ్లు నవ్వి గేలి చేశారు. రూ. 2 లక్షల రుణమాఫీ వీళ్ల వల్ల ఏమవుతుందని అనుకున్నారు. కాంగ్రెస్​ మాటిస్తే ఆ మాట మీద నిలబడుతుంది. రైతులను బాగు చేసేందుకు రుణమాఫీ చేస్తున్నాం. చేయ లేమని.. అసాధ్యమని అనుకున్న దానిని సాధ్యం చేసి చూపిస్తున్నాం. రైతు కూలీలు, భూమిలేని నిరుపేదల గురించి ఎవరూ పట్టించుకోలేదు. 

వారి గురించి మేం ఆలో చించాం. వారికి కూడా ఏడాదికి రూ.12 వేలు ఇవ్వాలని నిర్ణయించాం. ఈ ఏడాది నుంచే వారికి ఆర్థిక సాయం అందించేలా ఈ బడ్జెట్​లోనే పెట్టాం’’ అని ఆయన అన్నారు. బడ్జెట్​లో విద్యకూ ప్రాధాన్యమిచ్చామని భట్టి  చెప్పా రు. ‘‘నిరుద్యోగ యువతకు నైపుణ్యాలను పెంచేలా స్కిల్​ వర్సిటీని ఏర్పా టు చేస్తు న్నాం. పీపీపీతో దానిని ఏర్పాటు చేస్తున్నాం. బూజుపట్టిన ఐటీఐలను దులిపి అడ్వాన్స్​డ్​ టెక్నాలజీ సెంటర్లుగా వాటిని మార్చాలని నిర్ణయించాం. టాటా సంస్థతో ఒప్పందం చేసుకుని 65 ఐటీఐలను అభివృద్ధి చేయబోతున్నాం’’  అని వివరించారు.