కడెం, వెలుగు : నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండలం రేవోజిపేటలో పొలంలో దున్నుతుండగా నంది, శివలింగం విగ్రహాలు బయటపడ్డాయి. కోలా మహేశ్అనే రైతు గత శనివారం పొలాన్ని దున్నిస్తుండగా ట్రాక్టర్ నాగళ్లకు తగిలి ఓ విగ్రహం కొద్దిగా బయటకు వచ్చింది. డ్రైవర్ ఇదేమీ గమనించకుండానే పొలాన్ని పూర్తిగా దున్ని వెళ్లిపోయాడు. మరుసటి రోజు గొర్రెలను మేపేందుకు అటుగా వెళ్లిన గొర్ల కాపరి విగ్రహాన్ని గుర్తించి మహేశ్‌కు సమాచారం ఇచ్చాడు.
విషయాన్ని గ్రామస్తులు ఒగ్గు పూజారులకు చెప్పడంతో విగ్రహాన్ని తాకవద్దని, బుధవారం తొలి ఏకాదశి నాడు పూజలు చేయాలని చెప్పారు. దీంతో బుధవారం గోదావరి జలాలతో సంప్రోక్షణ చేసి విగ్రహాన్ని భూమి నుంచి బయటకు తీస్తుండగా లోపల శివలింగం కూడా బయటపడింది. విషయం తెలుసుకున్న చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చి పూజలు చేశారు.