డిసెంబర్ నెల 12 నుంచి హైటెక్స్‌‌లో 4 ఎక్స్‌‌పోలు

హైదరాబాద్, వెలుగు:  మీడియా డే మార్కెటింగ్ (ఎండీఎం), డెయిరీ,  ఫుడ్,  ఇండియా గ్రీన్ ఎనర్జీ.. నాలుగు  ఎక్స్‌‌పోలు  హైదరాబాద్‌‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌‌లో ఈనెల  12 నుంచి 14 వరకు మూడు రోజుల పాటు జరగనున్నాయి.  ఈ ఎక్స్‌‌పోలకు  రాష్ట్ర  రవాణా శాఖ మంత్రి  పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు.  ఐఏఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీ (ఇంధనం) సందీప్ కుమార్ సుల్తానియా తదితరులు హాజరవుతారు. ఈ నాలుగు ఎక్స్‌‌పోలకు  ఎఫ్‌‌టీసీసీఐ, డీఐసీసీఐ, తెలంగాణ సోలార్ ఎనర్జీ అసోసియేషన్, ఇతర స్థానిక సంస్థలు  మద్దతు ఇస్తున్నాయి.

గ్రీన్ వెహికల్ ఎక్స్‌‌పో 6వ ఎడిషన్‌‌లో ఎలక్ట్రిక్,  హైబ్రిడ్ వాహనాలు, బైక్‌‌లు, స్కూటర్లు, కార్లు, ఎల్‌‌సీవీలు, హెచ్‌‌సీవీలు , ట్రక్కులు, బ్యాటరీతో నడిచే వాహనాలు, విడి భాగాల తయారీ కంపెనీలు  తమ ప్రొడక్ట్‌‌లను ప్రదర్శనకు ఉంచుతాయి. ఎక్స్‌‌పో టైమ్‌‌లో వర్కాస్ -ఆర్ వైటో ఎలక్ట్రిక్స్   రూ.38,500 -ఉన్న ఈవీ స్కూటర్‌‌ను రూ. 24,500 -కి విక్రయిస్తోంది. ఈవీ టూ వీలర్లను విక్రయించడంలో తాము పెద్దగా ఆసక్తి చూపడం లేదని కంపెనీ సీటీఓ సందీప్ రాల్హాన్ విలేకరుల సమావేశంలో అన్నారు. ఈవీ మౌలిక సదుపాయాలు, పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేయడంపై  దృష్టి సారించామని పేర్కొన్నారు 

కేవలం రూ.11,000-  పెట్టుబడితో  టూ ,  త్రీ వీలర్ ఛార్జింగ్ స్టేషన్లను ఇన్‌‌స్టాల్ చేయడానికి  విప్లవాత్మక నమూనాను డెవలప్ చేశామన్నారు.  కిరాణా షాప్, పాన్ షాప్ నుంచి  టైర్ పంక్చర్ షాపుల  వరకు తక్కువ ఖర్చుతో ఛార్జింగ్ స్టేషన్‌‌ను ఏర్పాటు చేయొచ్చన్నారు.  నెలకు రూ. 5,000- సంపాదించొచ్చని తెలిపారు.  ఛార్జింగ్ స్టేషన్‌‌ను ఏర్పాటు చేయడానికి  త్రీ ఫేజ్ విద్యుత్ కనెక్షన్,  వాహనం ఛార్జ్ చేయడానికి తగినంత పార్కింగ్ స్థలం ఉంటే చాలని పేర్కొన్నారు. కాగా, ఈ నాలుగు ఎక్స్‌‌పోలలో 100 ఎగ్జిబిటర్లు ఉంటారు. 1,500 మంది సందర్శకులు వస్తారని అంచనా.