బెల్లంపల్లిలో ప్రజా దర్బార్ కు భారీ స్పందన

బెల్లంపల్లి, వెలుగు : బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి ఆధ్వర్యంలో సోమవారం పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్​కు అనూహ్య స్పందన వచ్చింది. ఉదయం 11 గంటలకు ప్రారంభమై సాయంత్రం వరకు కొనసాగిన ప్రజా దర్బార్​లో ఎమ్మెల్యేతోపాటు కలెక్టర్ కుమార్ దీపక్, ఆర్డీవో హరికృష్ణ, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు, తహసీల్దార్ జోత్స్నతదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో నెలకొన్న  తాగునీరు, భూ సమస్యపై భారీగా ఫిర్యాదులు వచ్చాయి. మొత్తం 250కి పైగా ఫిర్యాదులు వచ్చాయి.

స్థానికంగా మామిడి మార్కెట్ లేకపోవడంతో కాయలను పక్క రాష్ట్రాలకు అమ్ముకొని నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పట్టణంలో మామిడి మార్కెట్ యార్డు ఏర్పాటు చేయాలని కోరారు. బెల్లంపల్లి, తాండూర్, వేమనపల్లి, నెన్నెల, కాసీపేట, భీమిని, కన్నెపల్లి మండలాలకు చెందిన ప్రజలు భూ సమస్యలపై ఫిర్యాదులు అందజేశారు. బెల్లంపల్లిలో సింగరేణి భూములకు పట్టాలు జారీ చేయాలని, కొత్తగా నిర్మిస్తున్న ఇండ్లకు నెంబర్లు, విద్యుత్ కనెక్షన్లు ఇవ్వాలని ఫిర్యాదులు అందజేశారు.

ఈ సమస్యల పరిష్కారానికి అధికారులతో ఎమ్మెల్యే చర్చించి పరిష్కరించాలని ఆదేశించారు. బెల్లంపల్లి సింగరేణి అధికారి మహేశ్ కుమార్, మందమర్రి ఏరియా జీఎం దేవేందర్, ఏసీపీ రవికుమార్ మున్సిపల్ చైర్ పర్సన్ జక్కుల శ్వేతతో పాటు నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ శాఖల డివిజన్, మండలస్థాయి అధికారులు, ఎమ్మెల్యే సతీమణి గడ్డం రమ, కూతురు వర్ష తదితరులు పాల్గొన్నారు.