- ఆందోళన చెందుతున్న కాలనీవాసులు
కోల్‌బెల్ట్, వెలుగు : మందమర్రి, రామకృష్ణాపూర్ సింగరేణి కార్మికవాడల్లో ఆదివారం భారీ కొండ చిలువలు తిరగడం కలకలం రేపింది. మందమర్రిలోని గాంధీనగర్‌లో సుమారు 10 అడుగులకు పైగా ఉన్న ఓ కొండచిలువ ఓ ఇంట్లోకి దూరి పిల్లిని మింగింది. భారీ సర్పాన్ని చూసి భయపడిపోయిన ఇంటి యాజమాని వెంటనే సింగరేణి స్నేక్ సొసైటీ సభ్యులకు సమాచారం అందించారు. ఇద్దరు సభ్యులు అక్కడి చేరుకొని అతికష్టం మీద కొండచిలువను పట్టుకున్నారు.
అనంతరం సమీపంలోని అటవీ ప్రాంతంలో వదిలేశారు. రామకృష్ణాపూర్‌లోని శివాజీనగర్‌లో చెట్ల పొదల నుంచి కొండ చిలువ బయటకు రావడాన్ని గుర్తించిన స్థానికులు దాన్ని చంపేశారు. మందమర్రిలో ఇటీవల పాము కాటుకు గురై ఓ చిన్నారి, మరో యువతి చనిపోయింది. ఇప్పుడు భారీ కొండచిలువలు బయటపడడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు.