ఎదురు చూపులు ఫలించేనా?

  •     నామినేటెడ్​ పోస్టులపై కాంగ్రెస్​ లీడర్ల ఆశలు
  •     ఎలక్షన్​ కోడ్​ ముగియడంతో ప్రయత్నాలు

మెదక్, వెలుగు: నామినేటెడ్ పోస్టులు ఆశిస్తున్న కాంగ్రెస్ నాయకుల్లో మళ్లీ ఆశలు చిగురించాయి. రాష్ట్రంలో  గత డిసెంబర్​లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తామని సీఎం ప్రకటించారు. దీంతో జిల్లాలో ఆయా నామినేటేడ్​ పోస్టుల కోసం కాంగ్రెస్ నాయకులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కొందరు నియోజకవర్గ, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పోస్ట్ లు ఆశించారు. 

కాగా జిల్లాలో ఒక్క పోస్ట్ కూడా భర్తీ కాలేదు. ఈ క్రమంలో పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ రావడంతో నామినేటెడ్ పోస్టుల భర్తీకి బ్రేక్ పడింది. దీంతో ఆశావహులు నారాజ్​ అయ్యారు. లోక్​సభ ఎన్నికల ప్రక్రియ ముగిసి ఎలక్షన్ కోడ్ ఎత్తివేయడంతో పాటు, నామినేటెడ్ పోస్టుల భర్తీ పై సీఎం దృష్టిపెట్టడంతో  జిల్లాలో ఆయా పోస్టులు ఆశిస్తున్న కాంగ్రెస్ నాయకులు మళ్లీ ప్రయత్నాలు మొదలు పెట్టారు. 

అవకాశాలు ఇలా..

జిల్లాలో గ్రంథాలయ సంస్థ చైర్మన్, డైరెక్టర్, జిల్లా రైతుబంధు సమితి, మెదక్, రామాయంపేట, పాపన్నపేట, చేగుంట, తూప్రాన్​, నర్సాపూర్​ మార్కెట్ కమిటీ చైర్మన్, డైరెక్టర్, ఆయా వ్యవసాయ సబ్​ డివిజన్​ఆత్మ కమిటీ చైర్మన్, డైరెక్టర్, వివిధ ఆలయాల పాలక మండలి చైర్మన్, డైరెక్టర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటితో పాటు పలు రాష్ట్రస్థాయి నామినేటెడ్​ చైర్మన్​, డైరెక్టర్​ పోస్టుల్లో కూడా అవకాశం ఉంటుంది. 

ఎవరి ప్రయత్నాల్లో వారు..

మెదక్ నియోజకవర్గంలో రామాయంపేటకు చెందిన సుప్రభాత్​ రావు​, మెదక్ కు చెందిన బొజ్జ పవన్​, ఉప్పల రాజేశ్​, అరునార్తి వెంకట రమణ, జీవన్​ రావు​, మంగ మోహన్​ గౌడ్​, హఫీజొద్దీన్​, మెదక్​ మండలానికి చెందిన శ్రీనివాస్​ చౌదరి, శంకర్​, పాపన్నపేట మండలానికి చెందిన ప్రభాకర్​ రెడ్డి, ప్రశాంత్​ రెడ్డి, చిన్నశంకరంపేటకు చెందిన గంగ నరేందర్, నర్సాపూర్​ నియోజకవర్గ పార్టీ ఇన్​చార్జి ఆవుల రాజిరెడ్డి, డీసీసీ ప్రెసిడెంట్​ఆంజనేయులు గౌడ్​, సోమన్నగారి రవీందర్​ రెడ్డి, కొల్చారం, కౌడిపల్లి, నర్సాపూర్​, శివ్వంపేట, హత్నూర,  వెల్దుర్తి మండలాలకు చెందిన పలువురు నాయకులు ఆయా నామినేటెడ్​ పోస్టులు ఆశిస్తున్నారు. 

వీరితోపాటు గజ్వేల్​ నియోజకవర్గ పరిధిలోని తూప్రాన్​, మనోహరాబాద్​, దుబ్బాక నియోజకవర్గ పరిధిలోని చేగుంట, నార్సింగి, ఆందోల్​ నియోజకవర్గ పరిధిలోని టేక్మాల్​, రేగోడ్, అల్లాదుర్గం, నారాయణఖేడ్​ నియోజకవర్గ పరిధిలోని పెద్ద శంకరంపేట మండలాలకు చెందిన కాంగ్రెస్​ నాయకులు సైతం నామినేటెడ్ పోస్టులు ఆశిస్తున్నారు. ఆశావహులు ఎవరి స్థాయిలో వారు అటు వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, జిల్లా ఇన్​చార్జి మంత్రి కొండ సురేఖ, మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్​ రావు​, జిల్లా రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత రావు​ఆశీస్సులతో ఆయా పదవులు పొందేందుకు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. 

ఎన్నికల్లో పనితీరు ఆధారంగా..

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్​ నాయకుల పనితీరు, ఆయా ప్రాంతాల్లో పార్టీకి లభించిన ఓట్లను పరిగణనలోకి తీసుకుని నామినేటెడ్ పోస్టుల్లో ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు తెలిసింది. ఆయా నామినేటెడ్​ పోస్టులు ఆశిస్తున్న నాయకుల పనితీరును బేరీజు వేసి తదనుగుణంగా అవకాశాలు కల్పించనున్నట్టు సమాచారం. దీంతో ఎవరికి ఛాన్స్ దక్కుతుందనేది ఆసక్తి కరంగా మారింది.