నర్సాపూర్ లో హెచ్​ఎండీఏ లేఔట్స్​

  • వెంచర్స్​ కోసం పలు ప్రాంతాల పరిశీలన
  • రైతుల నుంచి భూసేకరణకు కసరత్తు
  • ఓఆర్ఆర్​, ట్రిపుల్ఆర్​ మధ్య ప్రాంత అభివృద్ధికి ప్రభుత్వం ప్రణాళిక

మెదక్, నర్సాపూర్, వెలుగు: ఇప్పుడున్న ఔటర్​రింగ్​రోడ్డు (ఓఆర్​ఆర్​), కొత్తగా నిర్మించే రీజినల్​రింగ్​రోడ్డు (ట్రిపుల్ఆర్) మధ్య ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇందులో భాగంగా  రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కు సమీపంలో ఉన్న మెదక్​జిల్లాలోని నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలో లేఔట్స్​ ఏర్పాటు చేయాలని హైదరాబాద్​ మెట్రో డెవలప్​మెంట్​అథారిటీ (హెచ్ఎండీఏ) నిర్ణయించింది. ఈ మేరకు ఇందుకు సంబంధించిన కార్యాచరణ ప్రారంభించింది. నర్సాపూర్​అవతలి నుంచి రీజినల్​రింగ్​రోడ్డు నిర్మించనున్నారు.

ఈ క్రమంలో ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న ఔటర్​రింగ్​రోడ్డు, కొత్తగా నిర్మించే ట్రిపుల్ఆర్​ మధ్య ప్రాంతాన్ని ప్రణాళికబద్ధంగా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో భూసమీకరణ పథకం (ల్యాండ్​ పూలింగ్​) అమలుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇందులో భాగంగా హెచ్ఎండీఏ పరిధిలో ఉన్న నర్సాపూర్​ పట్టణ పరిధిలో వెంచర్లు​ ఏర్పాటు చేసి ప్లాట్స్​చేసి అమ్మేందుకు ప్లాన్ ​చేస్తోంది.  నర్సాపూర్​ పట్టణ పరిధిలో మెదక్, తూప్రాన్, సంగారెడ్డి, హైదరాబాద్​రూట్లలో మెయిన్​ రోడ్డుకు సమీపంలో భూములు ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో ఎంతమంది రైతులు భూములు ఇచ్చేందుకు ముందుకు వస్తే అంతమంది నుంచి ల్యాండ్​పూలింగ్​ద్వారా భూములు సేకరించి లే అవుట్ చేయాలని యోచిస్తున్నారు. భూసేకరణ పూర్తయ్యాక భూమి యజమానులకు ఎలాంటి ఖర్చు లేకుండా మూడేళ్ల కాలంలో భూమిని లే ఔట్​గా అభివృద్ధి చేస్తారు. అభివృద్ధి చేసిన లే ఔట్​ప్లాట్లలో భూములు ఇచ్చిన రైతులకు 60 శాతం, హెచ్ ఎండీఏకు40 శాతం ప్లాట్లు కేటాయిస్తారు. 

మౌలిక వసతుల కల్పన

ల్యాండ్​ పూలింగ్​ కింద సేకరించిన భూమిని హెచ్​ఎండీఏ లేఔట్​చేయడం ద్వారా బ్రాండ్​విలువ లభిస్తుంది. వెంచర్​లో రోడ్లు, తాగునీరు, కరెంట్, పార్క్, సీవరేజి వంటి మౌలిక వసతులు కల్పించడం వల్ల రైతులకు లభించే ప్లాట్ల విలువ పెరుగుతుందని హెచ్ఎండీఏ అధికారులు చెబుతున్నారు. రైతుల నుంచి సేకరించే వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా (నాలా కన్వర్షన్) మార్చే బాధ్యత ఎచ్ఎండీఏనే తీసుకుంటుంది. అంతేగాక రైతులకు కేటాయించే ప్లాట్లను హెచ్​ఎండీఏనే రిజిస్ట్రేషన్ చార్జీ చెల్లించి రైతులకు రిజిస్ట్రేషన్​ చేయిస్తుంది. హెచ్ఎండీఏ వెంచర్​లో బిల్డింగ్ల నిర్మాణానికి పర్మిషన్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తొందరగా లభిస్తాయి.  ​ 

రైతులకు అవగాహన

ల్యాండ్ పూలింగ్ స్కీమ్ పై రైతులకు అవగాహన కల్పించడం కోసం కొద్ది రోజుల కింద నర్సాపూర్ లో సమావేశం ఏర్పాటు చేశారు. హెచ్ఎండీఏ అధికారులతోపాటు, రెవెన్యూ అధికారులు హాజరై  రైతులకు ల్యాండ్​ పూలింగ్​ఉద్దేశ్యం, పథకం అమలు తీరు, కలిగే ప్రయోజనాల గురించి వివరించారు. వారి డౌట్స్​ క్లియర్​ చేశారు. ల్యాండ్​ పూలింగ్​కు సహకరించాలని రైతులను కోరారు. ​కాగా ల్యాండ్​పూలింగ్ ​కింద సేకరించే అసైన్​మెంట్​భూమికి 600 గజాలు కాకుండా ఎక్కువ ఇవ్వాలని రైతులు కోరారు.