మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లాలో బుధవారం భారీ వర్షం పడింది. ఉదయం 6 నుంచి 9.30 గంటలకు ఎడతెరిపి లేకుండా వాన పడడంతో జిల్లా కేంద్రంలోని పలు కాలనీలు జలమయం అయ్యాయి. డ్రైనేజీలు పొంగిపొర్లడంతో సూర్యనగర్, ఎన్టీఆర్‌నగర్, రాంనగర్ ప్రాంతాల్లో మోకాళ్ల లోతు నీళ్లు చేరాయి. దీంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. హాజీపూర్ మండలంలో అత్యధికంగా 118.6 మిల్లీమీటర్లు, మంచిర్యాలలో 74.4, కాసిపేటలో 74.3, లక్సెట్టిపేటలో 57, మందమర్రి, నస్పూర్‌లో 56 మిల్లీమీటర్ల వాన పడింది. జిల్లాలో సగటున 32 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
ఎల్లంపల్లి 32 గేట్లు ఓపెన్
ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌కు ఎగువ నుంచి 4.60 లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది. దీంతో ప్రాజెక్ట్ 32 గేట్లను ఓపెన్ చేసి అంతే మొత్తంలో నీటిని విడుదల చేస్తున్నారు. మరోవైపు మంచిర్యాలలోని రాళ్లవాగు గతంలో ఎన్నడూ లేనంతగా ఉప్పొంగింది. దీంతో లోతట్టు ప్రాంతాలైన ఎన్టీఆర్‌నగర్, రాంనగర్ ప్రజలు ఆందోళనకు గురయ్యారు.