- కుకునూరుపల్లె లో పిడుగుపాటుకు ఒకరి మృతి
- మెదక్ టౌన్లో వడగళ్ల వాన
- కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యం
సిద్దిపేట, వెలుగు: సిద్దిపేట జిల్లాలో ఈదురు గాలులతో కురిసిన భారీ వర్షం భీభత్సం సృష్టించింది. మంగళవారం సాయంత్రం జిల్లాలోని సిద్దిపేట, బెజ్జంకి, జగదేవ్ పూర్, కొండపాక, చేర్యాల, మద్దూరు, కోహెడ, కొమురవెల్లి, తెగుట మండలాల్లో భారీ వర్షం కురిసింది. కుకునూరుపల్లె గ్రామానికి చెందిన కుమ్మరిమల్లేశం (36) వ్యవసాయ బావి వద్దకు వెళ్లే క్రమంలో పిడుగుపాటుకు గురై మృతి చెందాడు. కొమురవెల్లి మండలం గురువన్న పేట గ్రామంలో పిడుగు పాటుకు గేదె మృతి చెందింది. అకాల వర్షంతో పలు గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాలు, రోడ్ల పై ఆరబెట్టిన ధాన్యం తడిసిపోయింది. బెజ్జంకి మార్కెట్ యార్డులో భారీ వర్షానికి పెద్ద ఎత్తున ధాన్యం తడిసిపోగా వరద నీటిలో కొంత కొట్టుకుపోయింది. చేర్యాల, మద్దూరు మండలాల్లోని పలు గ్రామాల్లో భారీ గాలులకు ఇండ్ల పై కప్పులు ఎగిరిపోగా, జగదేవ్ పూర్ మండలంలో పలుచోట్ల చెట్లు నేలకొరిగాయి. భారీ గాలులతో కురిసిన వర్షం మూలంగా జిల్లాలోని పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది.
మెదక్ టౌన్, తూప్రాన్, వెలుగు: జిల్లాలోని పలు ప్రాంతాల్లో మంగళవారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. మెదక్ పట్టణంలో పావుగంట పాటు వడగళ్ల వాన కురిసింది. వ్యవసాయ మార్కెట్ యార్డులో నవాపేటకు చెందిన కొప్పుల లక్ష్మీ ధాన్యం కొట్టుకుపోయింది. కోరే పెంటయ్య 450 బస్తాల ధాన్యం కొనుగోలు కేంద్రానికి తీసుకురాగా వర్షానికి తడిసిపోయాయి. మరికొందరు రైతులు అధికారులు టాపర్లు ఇవ్వలేదని దీంతో వర్షానికి వడ్లన్నీ తడిసిపోయాయని ఆవేదన వ్యక్తంచేశారు. తూప్రాన్, నర్సాపూర్, నిజాంపేట్, వెల్దుర్తిలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది.
సంగారెడ్డి : జిల్లాలో సంగారెడ్డి, పటాన్ చెరు, అమీన్పూర్, గుమ్మడిదల, జిన్నారం, సదాశివపేట, రామచంద్రపురం మండలాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. సంగారెడ్డి, పటాన్ చెరు ప్రాంతాల్లో గాలి దుమారానికి రోడ్డుపై ఉన్న హోల్డింగులు కింద పడ్డాయి. ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రాశులు తడిసిపోయాయి. గాలి బలంగా వీయడం వల్ల మామిడి కాయలు రాలిపోయాయి.