మెదక్, సిద్దిపేట, వెలుగు : మెదక్ జిల్లాలో శుక్రవారం సాయంత్రం వాన దంచికొట్టింది. రాందాస్ చౌరస్తా, ఎంజీ రోడ్డు, ఆటోనగర్, వెంకట్రావ్ నగర్, సాయినగర్ కాలనీలు జలమయమయ్యాయి. రాందాస్ చౌరస్తా నుంచి జే ఎస్రోడ్డుకు వెళ్లే రూట్లో, పాత గాంధీ లైబ్రరీ వద్ద వరద ఉధృతికి పలు బైక్ లు కొట్టుకుపోయాయి. సాయినగర్ కాలనీలో ఇళ్ల మధ్యన నీరు నిలిచి కార్లు నీట మునిగాయి. ఆటోనగర్ నుంచి వెంకట్రావ్ నగర్ కాలనీకి వెళ్లే రూట్లో రాకపోకలకు ఆటంకం కలిగింది. దాదాపు రెండు గంటల పాటు కుండ పోత వాన పడగా 12.9 సెంటీ మీటర్లు వర్ష పాతం నమోదైంది.
ఈ వానాకాలం సీజన్లో జిల్లాలో ఇప్పటి వరకు ఇదే అతి పెద్ద వర్షం. మెదక్ మండలం పాతూర్ లో 9.3 సెంటీ మీటర్లు, చిన్నశంకరంపేటలో 5.6 సెంటీమీటర్లు, రామాయంపేటలో 5.5 సెంటీమీటర్లు, నార్సింగి మండలం శివనూర్ లో 4.5 సెంటీ మీటర్లు , వెల్దుర్తిలో 4.4 సెంటీ మీటర్ల వర్ష పాతం నమోదైంది. సిద్దిపేట జిల్లాలోని దుబ్బాక, గజ్వేల్, చేర్యాల, బెజ్జంకి, ములుగు, వర్గల్, కొండపాక మండలాల్లో భారీ వర్షం కురిసింది.
బెజ్జంకి సమీపంలోని ఈదుల వాగు పొంగిపొర్లడంతో రాకపోకలు నిలిచిపోయాయి. సిద్దిపేట లో మెదక్ రోడ్డు, పాత బస్టాండ్, హైదరాబాద్ రోడ్డు, శివాజీ నగర్ లలో రోడ్ల పై వరద నీరు చేరడంతో రాకపోకలు ఇబ్బంది కలిగింది. పట్టణంలోని నేజీలు పొంగిపొర్లాయి. దుబ్బాక పట్టణంలో కురిసిన భారీ వర్షంతో రోడ్లన్ని జలమయం కాగా గజ్వేల్ నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో భారీ వర్షం కురిసింది.