- సర్కార్ ఆఫీసులు, ఇండ్లల్లో చేరిన నీళ్లు
- బురద గూడలో తెగిన చెరువు, చేపల కోసం ఎగబడిన జనం
కాగజ్ నగర్/దహెగాం, వెలుగు: కాగజ్ నగర్ డివిజన్ వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. వరదనీరు పెద్ద ఎత్తున రావడంతో జనాలు అవస్థలు పడ్డారు. చింతలమానేపల్లి మండలం దిందా గ్రామానికి వెళ్లేలో లెవెల్ వంతెనపై భారీగా నీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఉదయం పిల్లలు స్కూల్కు వెళ్లలేదు. కాగజ్‌నగర్ మండలంలోని బురదగూడ చెరువు ఎడమ తూము కొట్టుకుపోయింది. దీంతో భారీగా నీరు పొలాలు, పత్తి చేనుల నుంచి పెద్దవాగులోకి చేరింది. వాగు ప్రవాహంలో భారీగా చేపలు పత్తి చేను, పొలాల్లోకి రావడంతోగ్రామస్తులు వాటిని పట్టుకునేందుకు ఎగబడ్డారు.
బెజ్జూర్ మండల కేంద్రంలోని ఎంపీడీఓ ఆఫీస్ ముందు వరద నిలిచి చెరువును తలపించింది. కౌటాల మండలం తాటిపల్లి యూపీఎస్ స్కూల్లో వరద చేరడంతో స్టూడెంట్స్ అవస్థ పడ్డారు. కాగజ్ నగర్ పట్టణం లోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇండ్లల్లోకి వరద చేరింది. బైక్ లు నీట మునిగాయి. దహెగాం మండలం చిన్నరాస్పల్లిలో రామగుండం సంజీవ్ అనే వ్యక్తిఇంటి గోడ కూలిపోయింది. రాత్రి అందరూ నిద్రిస్తున్న టైంలో గోడ బయటివైపు పడటంతో ప్రాణహాని తప్పింది.