అభివృద్ధి కోసం అందరూ కలిసిరావాలి : దామోదర రాజనర్సింహ

  •     చెరువులు, కాల్వల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు
  •     మంత్రి దామోదర రాజనర్సింహ వెల్లడి

రామచంద్రాపురం, వెలుగు : అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ పాలన సాగుతోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ చెప్పారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు సామాజికపాలన అందిస్తూ రేవంత్‌‌‌‌‌‌‌‌ సర్కార్‌‌‌‌‌‌‌‌ ముందుకు వెళ్తోందన్నారు. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్‌‌‌‌‌‌‌‌ మున్సిపాలిటీ కొత్త బిల్డింగ్‌‌‌‌‌‌‌‌ను శుక్రవారం మెదక్‌‌‌‌‌‌‌‌ ఎంపీ రఘునందన్‌‌‌‌‌‌‌‌రావుతో కలిసి ప్రారంభించారు. అనంతరం రేడియల్‌‌‌‌‌‌‌‌ రోడ్డుపై హైమాస్ట్‌‌‌‌‌‌‌‌ లైట్లను ప్రారంభించి, గద్దర్‌‌‌‌‌‌‌‌ ఆడిటోరియం, మల్టీ పర్పస్‌‌‌‌‌‌‌‌ హాల్‌‌‌‌‌‌‌‌ పనులకు శంకుస్థాపన చేశారు. 

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం, ప్రాంతాల అభివృద్ధి కోసం రాజకీయాలకు అతీతంగా కలిసి రావాలని పిలుపునిచ్చారు. రాజకీయాల్లో ఓడిపోవడం, గెలవడం సాధారణమని ప్రజాభిమానం ఉన్న నాయకులకు ప్రజాసేవే ముఖ్యమన్నారు. రాష్ట్రంలోని చెరువులు, కుంటలు, కాల్వల పరిరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని, ప్రకృతితో చెలగాటం ఆడితే మనిషి మనుగడే కష్టమవుతుందన్నారు. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో తెల్లాపూర్‌‌‌‌‌‌‌‌ ఫస్ట్‌‌‌‌‌‌‌‌ ప్లేస్‌‌‌‌‌‌‌‌లో ఉంటుందని, భవిష్యత్‌‌‌‌‌‌‌‌లో ఈ ప్రాంతం మరో పట్టణం అవుతుందన్నారు. 15 రోజుల్లో తెల్లాపూర్‌‌‌‌‌‌‌‌కు అర్బన్‌‌‌‌‌‌‌‌ పీహెచ్‌‌‌‌‌‌‌‌సీ మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. 

తెల్లాపూర్‌‌‌‌‌‌‌‌ను తెలంగాణపురంగా మార్చాలి

తెలంగాణ ఉద్యమాల గడ్డ అయిన తెల్లాపూర్‌‌‌‌‌‌‌‌ అసలు పేరు తెలంగాణపురం కాబట్టి గ్రామం పేరును తెలంగాణపురంగా మార్చేలా కేబినెట్‌‌‌‌‌‌‌‌లో తీర్మానం చేయించాలని ఎంపీ రఘునందన్‌‌‌‌‌‌‌‌రావు మంత్రి దామోదర రాజనర్సింహను కోరారు. కొల్లూర్‌‌‌‌‌‌‌‌ వద్ద సర్వీస్‌‌‌‌‌‌‌‌ రోడ్డు, నాగులపల్లి హెచ్‌‌‌‌‌‌‌‌జీసీఎల్‌‌‌‌‌‌‌‌ ఆర్వోబీ , ఎంఐజీ అండర్‌‌‌‌‌‌‌‌ పాస్‌‌‌‌‌‌‌‌ బ్రిడ్జిల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలని కోరారు. 

కార్యక్రమంలో ఎమ్యెల్యే మహిపాల్‌‌‌‌‌‌‌‌రెడ్డి, మున్సిపల్‌‌‌‌‌‌‌‌ చైర్మన్లు లలితా సోమిరెడ్డి, పాండు రంగారెడ్డి, కమిషనర్లు సంగారెడ్డి, జ్యోతిరెడ్డి, అడిషినల్ కలెక్టర్​చంద్రశేఖర్, ఆర్డీవో వసంత కుమారి, జడ్పీ చైర్మన్‌‌‌‌‌‌‌‌ మంజుశ్రీ, తహసీల్దార్‌‌‌‌‌‌‌‌ సంగ్రామ్‌‌‌‌‌‌‌‌ రెడ్డి, వైస్‌‌‌‌‌‌‌‌ చైర్మన్‌‌‌‌‌‌‌‌ రాములు పాల్గొన్నారు.