ఆదిలాబాద్ జిల్లాలో ఫటాఫట్ వార్తలు ఇవే.. డోంట్ మిస్

యోగా ఛాంపియన్​షిప్ ​సాధించిన రమేశ్

కోల్​బెల్ట్, వెలుగు: మందమర్రి పట్టణానికి చెందిన కొంపెల్లి రమేశ్​ నేషనల్ ​యోగా ఛాంపియన్ షిప్ కైవసం చేసుకున్నారు. ఇండియా యోగా స్కూల్​ఆధ్వర్యంలో బెల్లంపల్లిలో ఆదివారం నిర్వహించిన జాతీయ స్థాయి యోగా పోటీల్లో వివిధ ప్రాంతాలకు చెందిన 300 మంది తలపడగా.. రమేశ్​ ప్రతిభ కనబర్చాడు. ఈ సందర్భంగా రమేశ్​ను మందమర్రి బస్టాండ్ ఏరియా వ్యాపార సంఘం ఆధ్వర్యంలో సోమవారం సన్మానించారు.

మందమర్రి సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో యోగా మాస్టర్ ​ముల్కల శంకర్ వద్ద శిక్షణ పొందుతున్న రమేశ్​తో పాటు ఎస్.శ్రీలత గోల్డ్​మెడల్, సుజాత​, మచ్చయ్య, దామోదర్, కృష్ణవేణిలు సిల్వర్​మోడల్స్​సాధించారు. రామకృష్ణాపూర్​కు చెందిన సింగరేణి రిటైర్డ్ ఉద్యోగి ఎం.రాజకొమురయ్య గోల్డ్​ మెడల్ దక్కించుకున్నాడు.

నిబంధనలు పాటించని స్కూళ్లపై చర్యలు  తీసుకోవాలి

నస్పూర్, వెలుగు: మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా కొన్ని ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లు, ఇంటర్​కాలేజీలు నిబంధనలకు విరుద్ధంగా సెలవు రోజుల్లో కూడా క్లాసులు నిర్వహిస్తూ విద్యార్థులను మానసికంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నీరటి రాంప్రసాద్ అన్నారు. నిబంధనలు పాటించని స్కూళ్లపై చర్యలు తీసుకోవాలని సోమవారం డీఈవో ఆఫీస్ సూపరింటెంటెంట్​కు వినతిపత్రం అందించి మాట్లాడారు.

ఇష్టానుసారంగా స్కూళ్లు నిర్వహిస్తున్నా 
విద్యాశాఖ అధికారులు పట్టించుకోకపోవడం లేదని ఆరోపించారు. కొన్ని ప్రైవేట్, కార్పొ రేట్ జూనియర్ కాలేజీల పీఆర్ఓలు అడ్మిషన్లు కోసం స్కూళ్లకు వచ్చి విద్యార్థులను ప్రలోభాలకు గురిచేస్తున్నారని, ఇలాంటి వాటిని అరికట్టాలని కోరారు.

జిల్లా ఆఫీసర్ల సంఘం అధ్యక్షుడిగా జడ్పీ సీఈవో

నిర్మల్, వెలుగు: నిర్మల్​ జిల్లా అధికారుల సంక్షేమ సంఘం కార్యవర్గాన్ని సోమవారం కలెక్టరేట్​లోని మీటింగ్ హాల్​లో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సంఘం గౌరవ అధ్యక్షుడిగా అడిషనల్​ కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, అధ్యక్షుడిగా జిల్లా పరిషత్ సీఈవో గోవింద్​ను ఎన్నుకున్నారు. సహ అధ్యక్షుడిగా జిల్లా ప్రణాళిక అధికారి జీవరత్నం, ఉపాధ్యక్షులుగా విజయలక్ష్మి(డీఆర్డీవో), అశోక్ కుమార్ (ఈఈ, ఆర్అండ్ బీ), సుదర్శన్ (ఏడీఎల్ అండ్ ఆర్)ను, జనరల్ సెక్రటరీగా కిరణ్ కుమార్ (పౌరసరఫరాల అధికారి), జాయింట్ సెక్రటరీలుగా శ్రీనివాస్ (డీపీఓ), నరసింహారెడ్డి (పరిశ్రమల డీఎం), రాంగోపాల్ (లీడ్ బ్యాంక్ మేనేజర్), ట్రెజరర్ గా అంబాజీ (గిరిజన అభివృద్ధి అధికారి), పబ్లిసిటీ సెక్రటరీగా విష్ణువర్ధన్ (డీపీఆర్ఓ) తోపాటు ఇతర సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

పెంబి పోలీస్ స్టేషన్ లో డీఎస్పీ తనిఖీలు

పెంబి, వెలుగు: మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ను నిర్మల్ డీఎస్పీ గంగారెడ్డి, సీఐ సైదారావు సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా స్టేషన్​లోని రికార్డులను పరిశీలించారు. కేసుల వివరాలను పెంబి ఎస్​హెచ్ ఓ హన్మాండ్లును అడిగి తెలుసుకున్నారు. స్టేషన్ రికార్డులు బాగున్నాయని సిబ్బందిని అభినందించారు. ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉండాలని, డయల్ 100 కాల్స్​కు వెంటనే స్పందించాలని సూచించారు. నేరాల పట్ల అవగాహన కలిగి ఉండాలన్నారు