ఆదిలాబాద్ జిల్లాలో ఫటాఫట్ వార్తలు ఇవే.. డోంట్ మిస్

ట్రాఫిక్​ రూల్స్​ పాటించాలి  

నస్పూర్, వెలుగు: వాహనదారులు రోడ్డు భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించి సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం కలెక్టరేట్​లో జిల్లా రవాణా అధికారి సంతోష్ కుమార్ తో కలిసి రోడ్డు భద్రతా మాసోత్సవాల వాల్ పోస్టర్లను రిలీజ్ ​చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాల నియంత్రణలో వాహనదారులు తమ వంతు పాత్ర పోషించాలని తెలిపారు. మద్యం తాగి వాహనం నడపొద్దని సూచించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్లు, ఇతర వాహనాలు నడిపేవారు సీట్​ బెల్టులు ధరించాలని కోరారు. మాసోత్సవాల్లో భాగంగా రోడ్డు భద్రతా నియమాలను వివరిస్తూ ప్రత్యేక అవగాహన కల్పించనున్నట్లు చెప్పారు.

సమాజ నిర్మాణంలో టీచర్ల పాత్ర కీలకం

మంచిర్యాల, వెలుగు: సమాజ నిర్మాణంలో టీచర్ల పాత్ర కీలకమని డీఈవో ఎస్​.యాదయ్య అన్నారు. గురువారం తన చాంబర్​లో టీఎస్​ యూటీఎఫ్​ డైరీ, క్యాలెండర్, అధ్యాపకదర్శినిలను రిలీజ్​ చేశారు. సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు గుండారపు చక్రపాణి, గుర్రాల రాజావేణు మాట్లాడుతూ, విద్యారంగ సమస్యలపై పోరాటంలో టీఎస్​ యూటీఎఫ్​ ముందు వరుసలో ఉంటుందన్నారు. సంఘం నాయకులు వి.కిరణ్​కుమార్, బి.కిరణ్, బి.దేవదాస్, కే.చంద్రమౌళి పాల్గొన్నారు.

నిర్మల్ ఉత్సవాల ఏర్పాట్ల పరిశీలన

నిర్మల్, వెలుగు: నిర్మల్ ఉత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని అడిషనల్ కలెక్టర్ కిషోర్ కుమార్ అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో ఈ నెల 5, 6, 7 తేదీల్లో నిర్వహించనున్న నిర్మల్ ఉత్సవాల కార్యక్రమం ఏర్పాట్లను గురువారం అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. స్టేజి, స్టాల్స్, ఏర్పాటు చేయబోయే ప్రదేశాలను పరిశీలించి పలు సూచనలు చేశారు. పార్కింగ్​కు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలన్నారు. అర్డీవో రత్నకల్యాణి, డీఆర్డీవో విజయలక్ష్మి, డీవైఎస్​వో శ్రీకాంత్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ ఖమర్ అహ్మద్, తహసీల్దార్ రాజు తదితరులు పాల్గొన్నారు.

బైక్ చోరీ కేసులో ఎడాది జైలు

జన్నారం,వెలుగు: మండల కేంద్రంలో గతేడాది జూలైలో బైక్ చోరీ చేసిన మూట పల్లి పవన్ అనే యువకుడికి లక్సెట్టిపేట కోర్టు ఎడాది జైలు శిక్ష విధించింది. ఎస్​ఐ రాజవ ర్దన్ వివరాల ప్రకారం.. కరీంనగర్ జిల్లా కొత్తపెల్లి మండలం చింతకుంట గ్రామానికి చెందిన మహమ్మద్ అనే వ్యక్తికి చెందిన పల్సర్ బైక్ ను మండల కేంద్రంలోని ఒక హోటల్ ముందు ఉంచగా.. పవన్ తీసుకెళ్లిపోయాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు పవన్​ను అరెస్ట్ చేసి రిమాండ్​కు పంపించారు. విచారణ జరిపిన న్యాయస్థానం గురువారం నిందితుడికి ఎడాది శిక్ష విధించినట్లు ఎస్ఐ చెప్పారు.

గంజాయి పట్టివేత 

జైనూర్, వెలుగు: మండలంలోని పోచంలోద్ది గ్రామంలో గురువారం పోలీసులు గంజాయి పట్టుకున్నారు. గ్రామానికి చెందిన షేక్ ఖయ్యుమ్ ఇంట్లో నిల్వ ఉంచిన 1400 గ్రాముల గంజాయిని పట్టుకున్నామని జైనూర్ ఎస్సై సాగర్ తెలిపారు. పక్కా సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ సిబ్బందితో దాడులు చేసి స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితుడిని అదుపులో తీసుకొని కేసు ఫైల్ చేసినట్లు చెప్పారు.

ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి

నేరడిగొండ, వెలుగు: ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని నేరడిగొండ మండలం కుప్టి గ్రామంలోని కేసీఆర్ పార్క్ లో గురువారం ఆయన మొక్కలు నాటారు. రాబోయే తరాన్ని దృష్టిలో పెట్టుకొని పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలన్నారు. కుమారి గ్రామంలో పర్యటించి బీడీ కార్మికులతో ముచ్చటించి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. మాజీ ఎంపీపీ రాథోడ్ సజన్, సామాజిక కార్యకర్త కొయ్యడి గంగయ్య, కమలాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.