చిన్నశంకరంపేట/వెల్దుర్తి/శివ్వంపేట, వెలుగు: గ్యారంటీల పేరుతో గారడీ చేసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, నమ్మి ఓటేసిన ప్రజలను మోసం చేసిందని మాజీ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో గూబ గుయ్యిమనేలా తీర్పివ్వాలని పిలుపునిచ్చారు. మెదక్ బీఆర్ఎస్ క్యాండిడేట్ వెంకట్రామ్‌రెడ్డికి మద్దతుగా ఆదివారం చిన్నశంకరంపేట, వెల్దుర్తి, శివ్వంపేటలో నిర్వహించిన కార్నర్ మీటింగ్‌లలో మాట్లాడారు.
మహాలక్ష్మి పథకం కింద మహిళలకు నెలకు రూ.2,500 ఇస్తామని ఇవ్వకుండా, నాలుగు నెలలుగా ఒక్కొక్కరికి రూ.10 వేలు బాకీ పడిందన్నారు. రాష్ట్రంలో కరెంట్, నీటి కష్టాలు మొదలయ్యాయని, వడ్లకు రూ.500 బోనస్ పేరుతో రైతన్నలను ప్రభుత్వం మోసం చేసిందన్నారు. కొత్త జిల్లాలను కాపాడుకోవాలంటే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడించాలని పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలపై పోరాడాలంటే ఎంపీగా వెంకట్రామ్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలన్నారు. ఎంపీ క్యాండిడేట్ వెంకట్రామ్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి పాల్గొన్నారు.