కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓట్లు వేస్తే ప్రజలను నట్టేట ముంచారని విమర్శించారు మాజీ మంత్రి, సిద్దిపేట హరీష్ రావు అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో అరచేతిలో వైకుంఠం చూపించి ఓట్లు దండుకున్నారన్నారు.కేసీఆర్ కంటే కంటే మంచిగా చేస్తారని ఆశపడ్డాం..కానీ, కాంగ్రెస్ ప్రజలను గోస పెడుతుందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక రైతుబంధు సరిగా పడతలేదన్నారు. కరెంట్14 గంటల కూడా వస్తలేదని అన్నారు. ఏప్రిల్ 28వ తేదీ ఆదివారం మెదక్ జిల్లా చిన్న శంకరంపేట రోడ్ షోలో హరీష్ పాల్గొని మాట్లాడారు.
ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు ఓటేస్తే ఆగమైపోతాం.. తస్మాత్ జాగ్రత్త అని హరీష్ రావు అన్నారు. కాంగ్రెస్ మెడలు వంచాలంటే గులాబీ జెండాతోనే సాధ్యమన్నారు. అధికారంలోకి రాగానే రుణమాఫీ చేస్తా అన్నాడు.. కానీ ఇంతవరకు చేయలేదని విమర్శించారు. రుణమాఫీ విషయంలో అమరవీరుల స్తూపం వద్దకు రమ్మంటే.. రేవంత్ రెడ్డి తోక ముడిచాడని హరీష్ ఎద్దేవా చేశారు. ధాన్యానికి రూ.500 బోనస్ ఇస్తామని ఇవ్వలేదన్నారు. అబద్ధాలు చెప్పి గద్దె మీద కూర్చున్న రేవంత్ రెడ్డికి ఓట్లతో గుణపాఠం చెప్పాలన్నారు. అసెంబ్లీలో ఆరు గారంటీల మీద మాట్లాడాలంటే కారు గుర్తుకు ఓటేయాలని కోరారు.
పదేళ్ల బీజేపీ ప్రభుత్వంలో రూ.350 ఉన్న సిలిండర్ వెయ్యి రూపాయలకు పెరిగిందన్నారు హరీష్ రావు. 60 రూపాయల పెట్రోల్, డీజిల్... 100 రూపాయలు చేశారు.. కనీస నిత్యవసర వస్తువుల మీద జీఎస్టీ వేసి ధరలు పెంచారని చెప్పారు. దుబ్బకలో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావును పొల్లు పొల్లు ఓడ గొట్టారన్న హరీష్ రావు.. బీజేపీ అభ్యర్థిని నమ్ముడు అంటే.. నీళ్లు లేని బావిలో దూకినట్టే అవుతుందన్నారు. తెలంగాణ ప్రజలకు శ్రీరామరక్ష కారు గుర్తు అని.. బీఆర్ఎస్ అభ్యర్థి వెంక్రటామిరెడ్డిని గెలిపించాలని హరీష్ రావు ప్రజలను కోరారు.