ఈదురు గాలుల బీభత్సం..నేల కూలిన కరెంట్​ స్తంభాలు

  • రోడ్డుకు అడ్డంగా విరిగిపడ్డ చెట్లు
  • అబ్లాపూర్​లో కూలిన ఇళ్లు 

పాపన్నపేట, వెలుగు : మెదక్​జిల్లా పాపన్నపేట మండలంలో గురువారం సాయంత్రం ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి.  కుర్తివాడ గేట్​నుంచి వాగు వరకు పది కరెంట్​ స్తంభాలు నేలకూలాయి.  వైర్లు తెగి రోడ్డు మీద పడ్డాయి. దీంతో పలు గ్రామాల పరిధిలో విద్యుత్​సరఫరా నిలిచిపోయింది. కుర్తివాడ హనుమాన్​ టెంపుల్​వద్ద ఓ పెద్ద చెట్టు విరిగి రోడ్డుకు అడ్డంగా పడింది. దీంతో కొంతసేపు పాపన్నపేట- టేక్మాల్​రూట్​లో రాకపోకలకు ఆటంకం కలిగింది.

గ్రామంలో చెట్ల కొమ్మలు విరిగి ఇండ్ల మీద పడ్డాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. బలమైన ఈదురు గాలులతోపాటు, భారీ వర్షం కురవడంతో అబ్లాపూర్​లో వడ్ల సంగమేశ్​ కు చెందిన  ఇళ్లు పూర్తిగా కూలిపోయింది. ఇంట్లోని సామగ్రి ధ్వంసం కావడంతో ఆ కుటుంబం పరిస్థితి దయనీయంగా మారింది.