మంచిర్యాల రైల్వే స్టేషన్​లో  24 కిలోల గంజాయి పట్టివేత 

మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల రైల్వే స్టేషన్​లో సోమవారం అర్ధరాత్రి 24 కిలోల గంజాయిని జీఆర్పీ పోలీసులు పట్టుకున్నారు. రాత్రి 11 గంటల ప్రాంతంలో ఒకటో నంబర్​ ప్లాట్​ఫామ్​పై ఎస్ఐ సుధాకర్, సిబ్బంది తనిఖీలు​ చేస్తుండగా మూడు బ్యాగులతో ఒక వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించాడు. అతడిని చెక్​ చేయగా 24 కిలోల గంజాయి లభించింది. ఒడిశా రాష్ట్రానికి చెందిన రాంచంద్ర స్వైన్  విజయవాడ రైల్వే స్టేషన్ లో ఒక వ్యక్తి వద్ద రూ.6 లక్షలకు 24 కిలోల గంజాయిని కొనుగోలు చేసి తన ఫ్రెండ్​ కన్హా బాలాజీ స్వైన్ తో కలిసి నవజీవన్ ఎక్స్​ప్రెస్​లో విజయవాడ నుంచి సూరత్ కు తరలిస్తున్నట్లు ఒప్పుకున్నాడు.

మార్గమధ్యలో రైలులో పోలీసులను చూసి భయపడి మంచిర్యాల స్టేషన్​లో దిగినట్టు చెప్పాడు. వేరే ట్రైన్ ఎక్కి సూరత్ కు వెళ్లడానికి ప్రయత్నిస్తుండగా, జీఆర్పీ పోలీసులకు చిక్కారు. రాంచంద్ర స్వైన్​ను అరెస్ట్​ చేసి రిమాండ్​కు తరలించామని, బాలాజీ స్వైన్​ పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు.