- ఉట్నూరులో మంత్రివర్గం ఉపసంఘం పర్యటన
- హాజరుకానున్న డిప్యూటీ సీఎం, మంత్రుల బృందం
- ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్, ఎమ్మెల్యే
ఆదిలాబాద్, వెలుగు:రైతు భరోసా విధివిధానాల్లో భాగంగా గురువారం ఉట్నూర్ లో మంత్రుల బృందం పర్యటించనుంది. ఇందుకు సంబంధించి బుధవారం స్థానిక ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ తో కలిసి కలెక్టర్ రాజర్షి షా ఏర్పాట్లను పరిశీలించారు. రాష్ట్ర వ్యాప్తంగా జరగనున్న ఈ వర్క్‌షాప్ ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి ప్రారంభం కానుంది. రైతు భరోసా పథకం అమలు కోసం ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రైతుల నుంచి అభిప్రాయాలు సేకరించనున్నారు.
రైతు భరోసా కమిటీ సభ్యులైన ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, సీతక్క హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో ఉట్నూర్ కేబీ కాంప్లెక్స్ లో హెలిప్యాడ్, మీటింగ్ హాల్ తదితర ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలించారు. మంత్రుల బృందం ఉదయం 10.30 గంటలకు ఉట్నూర్ కు చేరుకుంటారని, మధ్యాహ్నం 2 గంటల వరకు రైతుల అభిప్రాయ సేకరణ, వర్క్ షాప్ ఉంటుందని తెలిపారు.
రైతు భరోసా పథకంపై రైతులు, ప్రజాప్రతినిధులు, అన్ని వర్గాల వారి నుంచి అభిప్రాయాలు, సూచనలు స్వీకరిస్తారని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే బొజ్జు కోరారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ సురేందర్ రావు, అడిషనల్ కలెక్టర్ శ్యామలా దేవి, డీఎస్పీ నాగేందర్, ఆర్డీఓ జీవాకర్ రెడ్డి, ట్రైబల్ వెల్ఫేర్ డీడీ దిలీప్ కుమార్, సంబంధిత అధికారులు తదితరులు ఉన్నారు.