ఆదిలాబాద్ జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన గ్రూప్​-2

  • 55 శాతం దాటని హాజరు

ఆదిలాబాద్/ఆసిఫాబాద్/నస్పూర్, వెలుగు: గ్రూప్​2 పరీక్ష రెండో రోజు సోమవారం ప్రశాంతంగా ముగిసింది. దాదాపు సగం మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కాలేదు. అధికారుల సమన్వయంతో జిల్లాలో పరీక్షలను సజావుగా నిర్వహించామని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. జిల్లాలోని 48 కేంద్రాల్లో సోమవారం జరిగిన ఎగ్జామ్​కు 14,951 మంది అభ్యర్థులకు గానూ 7,301 మంది, మధ్యాహ్నం 7,293 మంది హాజరయ్యారని తెలిపారు. అభ్యర్థుల కోసం తాగునీరు, నిరంతర విద్యుత్ సరఫరా, రవాణా ఇతర సౌకర్యాలు కల్పించినట్లు ఓ ప్రకటనలో చెప్పారు. 

ఆదిలాబాద్​ జిల్లా కేంద్రంలోని సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల, ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఏర్పాటు చేసిన సెంటర్లను కలెక్టర్ రాజర్షి షా తనిఖీ చేశారు. 10,428 మందికి గాను ఉదయం జరిగిన పరీక్షకు 5,773 మంది, మధ్యాహ్నం 5,761 మంది హాజరైనట్లు చెప్పారు. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంతోపాటు, కాగజ్ నగర్ లో ఏర్పాటుచేసిన 18 సెంటర్లలో 4393 మంది పరీక్ష రాయాల్సి ఉండగా ఉదయం 2397 మంది, మధ్యాహ్నం 2395 మంది మాత్రమే రాశారు. కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే జిల్లా కేంద్రంలోని పలు సెంటర్లను పరిశీలించారు. ఎస్పీ డీవీ శ్రీనివాసరావు బందోబస్తును పర్యవేక్షించారు. 

మాజీ ఎమ్మెల్యే సమ్మయ్యపై ప్రశ్న

ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టీ దివంగత మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కావేటి సమ్మయ్యకు సంబంధించి 4వ పేపర్​లో ఓ ప్రశ్న అడిగారు. ఈ క్రింది వ్యాఖ్యలను పరిగణించండి అని పేర్కొంటూ.. (ఎ) తెలంగాణ ఉద్యమంలో పాల్లొంటున్న విద్యార్థుల యోగక్షేమాల కోసం సిర్పూర్ కాగజ్ నగర్ నివాసి కావేటి సమ్మయ్య అపమృత్యు హోమం అను వైదిక క్రతువు నిర్వహించెను అని, (బి) భద్రాచలం పట్టణంలో ఎంఆర్​పీఎస్​అర్ధనగ్నంగా ఊరేగినారు అని రెండు అప్షన్లు ఇచ్చారు.