శివ్వంపేట, వెలుగు: తమ జీతం బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ గ్రామ పంచాయతీ కార్మికులు శుక్రవారం శివ్వంపేట ఎంపీడీవో ఆఫీస్ ముందు ధర్నా చేశారు. వారికి సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు మహేందర్ రెడ్డి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీపీ కార్మికులకు 5 నెలలుగా జీతాలు రాకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారిందన్నారు.
అప్పులు చేసి కుటుంబాన్ని పోషిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. అనంతరం ఎంపీవో తిరుపతిరెడ్డికి వినతిపత్రం అందజేశారు.