జన్నారం మండలంలో అకాల వర్షం..అన్నదాతకు నష్టం

జన్నారం, వెలుగు : జన్నారం మండలంలో ఆదివారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి కొనుగోలు కేంద్రాల వద్ద విక్రయించేందుకు ఉంచిన వడ్లు తడిసిపోయాయి. ధాన్యం తడవకుండా ఉండేందుకు కుప్పలపై రైతులు కవర్లు కప్పి నానా తంటాలు పడినా వర్షంతో పాటు ఈదురు గాలులకు కవర్లు లేచిపోవడంతో ధాన్యం తడిసిపోయింది.

రెండ్రోజులుగా కురుస్తున్న వర్షాలకు కేంద్రాల వద్ద ఉంచిన ధాన్యం తడిసిపోతోంది. ఇప్పటికైనా సంబందిత ఆఫీసర్లు  స్పందించి ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని రైతులు కోరుతున్నారు.

దహెగాంలో..

దహెగాం, వెలుగు : దహగాం మండలంలో శనివారం రాత్రి కురిసిన వర్షం రైతులకు నష్టాలు మిగిల్చింది. పత్తి పంట తడిసి చెట్టు మీది నుంచి కారిపోయింది. పూత దశలో ఉన్న మిరప పంట పూత రాలిపోయింది. కల్లాల్లో ఆరబోసిన వడ్లు తడిసిపోయాయి.

దీంతో రైతులు వడ్లను ఆరబెట్టడానికి నానా అవస్థలు పడుతున్నారు. కోతకు వచ్చిన వరి పొలాలు నీళ్లు నిండడంతో కోత ఆలస్యమయ్యే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.