ఎక్కడి ధాన్యం అక్కడే..!

  •     మందకొడిగా ధాన్యం కొనుగోళ్లు 
  •     కేంద్రాల్లో పేరుకుపోయిన వడ్లు
  •     రోడ్ల మీద కిలోమీటర్ల పొడుగునా ధాన్యమే
  •     అకాల వర్షాలతో తడిసిన వడ్లు  
  •     అధికారుల తీరును నిరసిస్తూ రైతుల ఆందోళనలు

మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి, వెలుగు : ఉమ్మడి మెదక్ జిల్లాలో ధాన్యం కొనుగోలు మందకొడిగా సాగుతోంది. కాంటాలు త్వరగా జరగపోవడం వల్ల వేలాది క్వింటాళ్ల ధాన్యం పేరుకుపోతోంది. కొల్చారం మండలం పోతంశెట్టిపల్లి వద్ద పెద్ద మొత్తంలో ధాన్యం కుప్పలు పేరుకుపోయాయి.  ఆయా రూట్లలో నేషనల్​ హైవే, స్టేట్​ హైవేలపై కిలోమీటర్ల పొడుగునా వడ్ల కుప్పలే కనిపిస్తున్నాయి. శివ్వంపేట మండలం చిన్న గొట్టిముక్కుల  నుంచి సికిండ్లాపూర్ రోడ్డులో 8 నుంచి 10 కిలో మీటర్ల వరకు రోడ్డుపై వడ్లు ఆరబోశారు. సరిపోయినన్ని లారీలు రాకపోవడంతో  తూకం వేసిన ధాన్యం బస్తాలు కొనుగోలు కేంద్రాల వద్దే ఉంటున్నాయి.

రైస్ మిల్లులకు తరలించే వరకు రైతులదే బాధ్యత అంటుండడంతో వారికి పడిగాపులు తప్పడం లేదు.  అంతేగాక టాపర్ల కిరాయి భారంగా మారుతోంది. మరోవైపు అకాల వర్షాలు రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. భారీ వర్షాలు కురుస్తుండడంతో కొనుగోలు కేంద్రాల వద్ద ఉన్న వడ్ల కుప్పలు, రోడ్ల మీద ఆరబోసిన వడ్లు తడిసిపోతున్నాయి.  కొన్నిచోట్ల వరదకు వడ్లు కొట్టుకుపోతున్నాయి.  వర్షాల నుంచి వడ్లు తడవకుండా చూసుకునేందుకు, తడిసిన వడ్లను ఆరబెట్టేందుకు రైతులు నానా తిప్పలు పడుతున్నారు.

రోడ్డెక్కుతున్న రైతులు

ధాన్యం కొనుగోళ్లలో జాప్యాన్ని నిరసిస్తూ అనేక చోట్ల రైతులు ఆందోళనకు దిగుతున్నారు. అధికారుల తీరును నిరసిస్తూ  రాస్తారోకో, ధర్నాలు చేస్తున్నారు. బుధవారం చిలప్​ చెడ్ మండలం చిట్కుల్​లో, గురువారం​ రామాయంపేట మండలం డి.ధర్మారంలో, శుక్రవారం రామాంపేట పట్టణంలో, పాపన్నపేటలో రైతులు ఆందోళన చేశారు. అధికారులు ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేస్తామని, లారీల కొరత నివారించి కాంటా పెట్టిన ధాన్యాన్ని రైస్​ మిల్లులకు తరలించేందుకు చర్యలు తీసుకుంటామని చెబుతున్నప్పటికీ పరిస్థితిలో మార్పు కనిపించడం లేదు.  

కొనుగోలు తీరిలా..

మెదక్ జిల్లాలో 3.66 లక్షల మెట్రిక్​ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలన్నది లక్ష్యం. ఈ మేరకు పీఏసీఎస్​, ఐకేసీ, ఏఎంసీల ఆధ్వర్యంలో 410 కొనుగోలు  కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు 41 వేల మంది రైతుల నుంచి దాదాపు 2 లక్షల మెట్రిక్​ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. దాదాపు 30 వేల మంది రైతులకు రూ.260 కోట్ల వరకు చెల్లించారు. సిద్దిపేట జిల్లాలో 3.50 లక్షల మెట్రిక్​ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలన్నది లక్ష్యం.  ఇప్పటివరకు 1,86,148 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని, 42657 మంది రైతుల నుంచి అధికారులు కొనుగోలు చేశారు.

అందుకు సంబంధించి రూ.300 కోట్ల పేమెంట్  చేయగా, మరో రూ.100 కోట్లు రిలీజ్ చేయాల్సి ఉంది. దుబ్బాక గజ్వేల్ ప్రాంతాల్లో నిన్న కురిసిన వర్షానికి వడ్లు తడిసిపోయినప్పటికీ వాటిని కూడా కొనుగోలు చేసి పక్కనే ఉన్న కేంద్రాలకు తరలిస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలో 1.96 లక్షల మెట్రిక్​ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా వేశారు. ఈ మేరకు ఐకేపీ, పీఏసీఎస్​, డీసీఎంఎస్​ ఆధ్వర్యంలో 211  కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు 13,343 మంది రైతుల నుంచి 68,236 మెట్రిక్​ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. 7,385 మంది రైతులకు రూ.97.72 కోట్ల పేమెంట్​ జరిగింది.