- ఓటింగ్ కు సిద్దమవుతున్న 4 మండలాల గ్రాడ్యుయేట్లు
- చేర్యాల సబ్ డివిజన్ లో మొత్తం 4679 మంది ఓటర్లు
- మంతనాలు జరుపుతున్న అభ్యర్థుల మద్దతుదారులు
సిద్దిపేట/చేర్యాల, వెలుగు : సిద్దిపేట జిల్లాలో పార్లమెంట్ ఎన్నికల సందడి ముగిసిందో లేదో నాలుగు మండలాల్లో మళ్లీ ఎమ్మెల్సీ ఎన్నికల సందడి మొదలైంది. వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం పరిధిలో జిల్లాలోని చేర్యాల సబ్ డివిజన్ లో 4 మండలాలుండడంతో గ్రాడ్యుయేట్ ఓటర్లు మరోసారి ఓటింగ్ కు సిద్దమవుతున్నారు. చేర్యాల, మద్దూరు, ధూల్మిట్ట, కొమురవెల్లి మండలాల పరిధిలో 4679 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉన్నారు. నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు మొత్తం 52 మంది బరిలో నిలిచారు.
వీరందరూ ఓటర్లను ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ నెల 27న పోలింగ్ జరుగుతుండడంతో ప్రధాన పార్టీల అభ్యర్థుల పక్షాన వారి మద్దతుదారులు రంగంలోకి దిగారు. మూడేళ్ల కింద జరిగిన ఎన్నికల్లో పల్లా రాజేశ్వరరెడ్డి ఎమ్మెల్సీగా ఎన్నికైనా ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన జనగామ ఎమ్మెల్యేగా గెలవడంతో ఖాళీ అయిన స్థానానికి ఎన్నిక నిర్వహిస్తున్నారు. గ్రాడ్యుయేట్ ఎన్నికల కోసం ఇటీవల కొత్తగా ఓటర్ల నమోదు కార్యక్రమం నిర్వహించగా దాదాపు వెయ్యి మందికి పైగా కొత్తగా పేర్లను నమోదు చేసుకున్నారు.
బరిలో ఎవరెవరూ..?
వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ తో పాటు ఇండిపెండెంట్లు పలువురు పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి చింతపండు నవీన్ (తీన్మార్ మల్లన్న), బీఆర్ఎస్ నుంచి రాకేశ్ రెడ్డి, బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డితో పాటు మరో 49 మంది పోటీ పడుతున్నారు. ఈ ఎన్నికల్లో ఓటర్లు ప్రాధాన్యతా క్రమంలో ఓట్లు వేయాల్సి ఉండడంతో అధిక సంఖ్యలో అభ్యర్థులు బరిలో నిలవడంతో భారీ సైజు బ్యాలెట్ తో పోలింగ్ నిర్వహించనున్నారు.
ఓటర్ల వివరాల సేకరణలో మద్దతుదారులు
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ల వేటలో ప్రధాన పార్టీ అభ్యర్థుల మద్దతుదారులు దృష్టిపెట్టారు. చేర్యాల సబ్ డివిజన్ పరిధిలో నమోదైన ఓటర్ల వివరాలు తెలుసుకొని ప్రణాళికలు రూపొందిస్తున్నారు. స్థానికంగా ఓటు నమోదు చేసుకుని ఉద్యోగ రీత్యా దూర ప్రాంతాల్లో ఉన్న ఓటర్ల వివరాలను ఇప్పటికే సేకరించడమే కాకుండా వారు పోలింగ్ రోజు వచ్చి ఓటు వేసే విధంగా ప్రయత్నాలు సాగిస్తున్నారు. రెండు రోజుల కింద వరకు పార్లమెంట్ ఎన్నికల్లో పాల్గొన్న నేతలు ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల పై దృష్టి పెట్టారు. రానున్న రోజుల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులు చేర్యాల సబ్ డివిజన్ లో పర్యటించి ఓటర్లతో సమావేశాల నిర్వహణకు ప్లాన్ చేస్తున్నారు.
చేర్యాల సబ్ డివిజన్ లోని ఓటర్ల వివరాలు
మండలం పురుషులు మహిళలు ఓటర్లు
చేర్యాల 1686 869 1558
మద్దూరు 642 293 935
ధూల్మిట్ట 346 165 511
కొమురవెల్లి 447 231 678
మొత్తం 3121 1558 4679