- కొత్త ఆవిష్కరణలు చేసి దేశాభివృద్ధికి పాటుపడాలి
- గవర్నర్ సీపీ రాధాకృష్ణన్
గజ్వేల్/ములుగు, వెలుగు: విద్యార్థులు డిగ్రీలతో ఆగొద్దని, రీసెర్చ్‌లపై దృష్టి సారించి కొత్త ఆవిష్కరణలు చేసి దేశాభివృద్దికి కృషిచేయాలని తెలంగాణ, జార్ఖండ్ రాష్ట్రాల గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. మంగళవారం సిద్దిపేట జిల్లా ములుగులోని శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం మూడో స్నాతకోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
భారత ఆర్థిక వ్యవస్థ 2047 నాటికి 30 ట్రిలియన్ డాలర్ల స్థూల జాతీయోత్పత్తిగా ఎదిగేందుకు పుష్కల అవకాశాలున్నాయని, ఇది వికసిత్ భారత్ ద్వారా సాధ్యమవుతుందన్నారు. ఇందులో యువత ప్రముఖ పాత్ర పోషించాలన్నారు.
చిన్న సన్నకారు రైతుల ఎదుగుదలకు కృషి జరగాలన్నారు. విద్యలో నాణ్యత పెంపొందించేందుకు రాజ్‌భవన్ ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుందన్నారు. సాగు నేల, సహజ వనరులు, పంటల ఉత్సాదకతలు తరిగిపోతున్నాయన్నారు. అలాగే పర్యావరణ మార్పుల నేపథ్యంలో స్థిర ఆహార, పోషక భద్రత సాధించడంతో పాటు సూపర్ ఎకనామిక్ పవర్‌గా భారత్ ఎదిగేందుకు టెక్నాలజీ ఆధారిత వ్యవసాయపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు.
ఆధునిక వ్యవసాయ విజ్ఞానం కావాలి
తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ గీతాలక్ష్మి మాట్లాడుతూ ప్రెసిషన్ ఫామింగ్(ఖచ్చితమైన వ్యవసాయం), బిగ్ డేటా, కృత్రిమ మేధస్సు(ఏఐ), రోబోట్స్, డ్రోన్స్, రిమోట్ సెన్సింగ్ వంటి ఆధునిక వ్యవసాయ విజ్ఞానాన్ని రైతులకు పరిచయం చేయాలని, దాని ద్వారా పంటల ఉత్పాదకత, దిగుబడుల నాణ్యత పెరుగుతుందన్నారు. పంట కోత తర్వాత 20 నుంచి 30 శాతం దిగుబడి నష్టం జరుగుతుందని, ఈ నేపథ్యంలో పంట ఉత్పత్తులను నిల్వ చేయడానికి ఆధునిక సదుపాయాలు అవసరమన్నారు.
ములుగు ఉద్యాన విశ్వవిద్యాలయ వైస్ చాన్స్‌లర్ నీరజ ప్రభాకర్ మాట్లాడుతూ తెలంగాణలో బాలనగర్ సీతాఫలం, ఆర్మూర్ పసుపుతో పాటు మరికొన్ని స్థానిక పంటలకు భౌగోళిక గుర్తింపు, రైతు వంగడాల రిజిస్ట్రేషన్ కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. 156 మంది స్టుడెంట్స్కు ఉద్యాన డిగ్రీలు, 50 మందికి ఫారెస్ట్ డిగ్రీలు, 45 మందికి ఉద్యాన పీజీ, 30 మందికి ఫారెస్ట్ పీజీ, మరో ఆరుగురు స్టూడెంట్స్ కు డాక్టరేట్పట్టాలను గవర్నర్ అందజేశారు. వర్సిటీ రిజిస్ట్రార్ భగవాన్, డీన్ రాజశేఖర్, పరిశోధన సంచాలకులు కిరణ్, డీఎస్ఏ విజయ, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ శ్రీనివాస్, ఉద్యాన శాఖ కమిషనర్ అశోక్ రెడ్డి, బోర్డు సభ్యుడు మధుర్ పాల్గొన్నారు.