రైతులకు తేమ టెన్షన్​

  • ఎలక్ట్రానిక్​ మిషన్లతో ఇబ్బందులు      
  •  తేమ శాతంలో తేడాలు
  • ఎక్కువ ఉందని ధాన్యాన్ని రిజెక్ట్​చేస్తున్న నిర్వాహకులు
  • మెకానిక్​ మాయిశ్చర్​ మిషన్లు ఏర్పాటు చేయాలని  కోరుతున్న రైతులు

మెదక్, వెలుగు: రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తుండగా తేమ, తరుగు సమస్యతో రైతులు నష్టాలను ఎదుర్కొంటున్నారు.  రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుత సీజన్​లో 7,600 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వ గైడ్​లైన్స్​ప్రకారం 17 శాతం తేమ ఉన్న ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేస్తారు. అంతకంటే ఎక్కువ ఉంటే తూకం వేయరు. ఈ క్రమంలో కొనుగోలు కేంద్రాల్లో తేమ శాతాన్ని పరిశీలించేందుకు ఎలక్ట్రానిక్ మాయిశ్చర్ మీటర్లు వినియోగిస్తున్నారు. నిర్వాహకులకు ఎలక్ట్రానిక్​ మాయిశ్చర్​ మిషన్ల వినియోగంపై సరైన అవగాహన లేకపోవడం వల్ల తేమ శాతంలో తేడాలు వస్తున్నాయి.

 తేమ శాతాన్ని కచ్చితంగా గుర్తించాలంటే మాయిశ్చర్​ మిషన్​లో ఎంత ధాన్యం పోయాలో అంతే పోయాలి. అలా అయితేనే ధాన్యంలో మాయిశ్చర్​ ఎంత ఉందనేది పక్కాగా తెలుస్తుంది. కాగా కొనుగోలు కేంద్రాల నిర్వహకులు మిషన్​లో ధాన్యం సరిగా పోయకుండా ఆదరాబాదరాగా పరిశీలించడం వల్ల తేమ శాతంలో తేడాలు వస్తున్నాయి. దీంతో నిర్దేశించిన 17 శాతం కంటే ఎక్కువ తేమ ఉందని చెప్పి ధాన్యాన్ని రిజెక్ట్​ చేస్తున్నారు. 

ఈ పరిస్థితి వల్ల రైతులు ధాన్యాన్ని మళ్లీ ఆరబోయాల్సి వస్తోంది. ఈ క్రమంలో అకాల వర్షాల వల్ల ధాన్యం తడిసిపోయి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇదిలా ఉండగా కొనుగోలు కేంద్రాల నుంచి రైస్​ మిల్లులకు వెళ్లిన ధాన్యంలో తేమ ఎక్కువ ఉందని మిల్లర్లు తరుగు పేరుతో క్వింటాలుకు 5 నుంచి 10 కిలోల వరకు కోత విధిస్తున్నారు. ఇలా చేయడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.    

మెకానికల్​ మిషన్​ ఉపయోగిస్తే..

రైస్ మిల్లులలో ధాన్యంలో తేమ శాతాన్ని పరిశీలించేందుకు మెకానికల్ మాయిశ్చర్ మిషన్లు వినియోగిస్తారు. ఈ మిషన్ల ద్వారా ధాన్యంలో తేమ ఎంతుందనేది పక్కగా తెలుస్తుంది. ​అందువల్ల రైస్​ మిల్లర్లందరూ మెకానికల్ ​మాయిశ్చర్​ మిషన్లనే ఉపయోగిస్తారు. కొనుగోలు కేంద్రాల్లో ఎలక్ట్రినిక్​ మాయిశ్చర్​మిషన్​ ద్వారా తేమ శాతాన్ని పరిశీలించి తూకం వేసిన తర్వాత మిల్లుకు పంపే ధాన్యాన్ని మిల్లర్లు మెకానికల్​ మాయిశ్చర్​ మిషన్​ ద్వారా మళ్లీ పరిశీలిస్తున్నారు. అక్కడ తేమ శాతం 17 కంటే ఎక్కువ ఉన్నట్టు తేలడంతో తరుగు పేరుతో కోత విధిస్తున్నారు. దీంతో రైతులకు, మిల్లర్లకు మధ్య గొడవలు జరుగుతున్నాయి.  ప్రతి సీజన్​లో పలు చోట్ల ఈ సమస్య ఉత్పన్నమవుతోంది. 

ఈ నేపథ్యంలో కొనుగోలు కేంద్రాల్లో తేమ శాతాన్ని కచ్చితంగా పరిశీలించేందుకు ఎలక్ట్రానిక్​ మాయిశ్చర్​ మిషన్ల కు బదులు మెకానికల్​మాయిశ్చర్​ మిషన్లు ఉంటే మంచిదన్న అభిప్రాయం సివిల్ సప్లై అధికారుల నుంచి వ్యక్తమవుతోంది. కొనుగోలు కేంద్రాలకు సరఫరా చేసిన ఎలక్ట్రానిక్​మాయిశ్చర్​మిషన్​ధర ఒక్కోటి రూ.7 వేలు ఉంటుంది. రైస్​ మిల్లుల్లో వినియోగించే మెకానికల్​ మాయిశ్చర్​మిషన్​ ధర ఒక్కోటి రూ.13 వేల వరకు ఉంటుంది. ఇందులో రూ.8 వేల నుంచి రూ.9 వేల ధరకు దొరికే చిన్న సైజు మెకానికల్​మాయిశ్చర్​మిషన్లు కూడా మార్కెట్​లో లభ్యమవుతాయి. కొనుగోలు కేంద్రాల్లో తేమ విషయంలో రైతులు ఎదుర్కొంటున్నసమస్య తొలగిపోవాలంటే అన్ని కొనుగోలు కేంద్రాలకు మెకానికల్​మాయిశ్చర్​మిషన్లు సరఫరా చేస్తే బాగుంటుందని సివిల్​సప్లై డిపార్ట్​ మెంట్​అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.   

తేమ విషయంలో రైతులను ఇబ్బంది పెట్టొద్దు 

నేను వరి కోసి వారం రోజులైంది. రోజు సెంటర్​దగ్గర వడ్లు ఆరబోసి రాత్రికి కుప్ప చేస్తున్నాం. నా లెక్కనే అందరు రైతులు వడ్లు ఆరబోస్తున్నరు. తేమ విషయంలో రైతులను ఇబ్బంది పెట్టకుండా వడ్లు కాంటా పెట్టాలి. సెంటర్ లోనే తేమ శాతం పక్కాగా చెక్​చేయాలి. రైస్​ మిల్లుకు పంపినంక తేమ ఎక్కువుందని తరుగు తీస్తే మేం లాసైతం.పీర్యా నాయక్​, రైతు,
నర్సింగరావుపల్లి తండా