- ఎకో టూరిజం కింద కుంటాల జలపాతం, కవ్వాల్ టైగర్ ఫారెస్ట్
- రూ.3.81 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం
- ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిన అధికారులు
ఆదిలాబాద్, వెలుగు: రాష్ట్రంలోనే అత్యంత ఎత్తయిన జలపాతంగా పేరుపొందిన కుంటాల జలపాతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు సర్కార్ దృష్టిపెట్టింది. ఇటీవల రాష్ట్రంలో ఎకోటూరిజం ప్రాంతాలను అభివృద్ధి చేయడంలో భాగంగా 12 ప్రకృతి సర్క్యూట్లను ప్రభుత్వం గుర్తించింది. ఇందులో ఆదిలాబాద్ జిల్లాలోని కుంటాల జలపాతం, కవ్వాల్ టైగర్ ఫారెస్ట్‌ను చేర్చింది.
ప్రకృతి పర్యటకం పేరుతో రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల పర్యాటకులను ఆకర్షించేందుకు అటవీ ప్రాంతాలు, జలవనరులు ఉన్న పరిసరాలను అభివృద్ధి చేసేందుకు నిర్ణయించింది. ఇందులో భాగంగానే ఆదిలాబాద్ జిల్లాలోని ఈ రెండు ప్రాంతాల్లో అవసరమైన పర్యాటక పనులకు సంబంధించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు.
రూ.3.81 కోట్లతో పనులు
కుంటల జలపాతం వద్ద పర్యటకులు సేద తీరేందుకు హరిత రిసార్ట్, కాటేజీలు, పార్క్, విశాలమైన రోడ్డు, కాంపౌండ్ వాల్, పార్కింగ్ స్థలం తదితర సదుపాయాల కోసం ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందు కోసం రూ. 3.81 కోట్లు నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది. స్థల సేకరణకు సంబంధించి ఇప్పటికే కలెక్టర్ రాజర్షి షా అధికారులతో కలిసి జలపాతం పరిసర ప్రాంతాలను పరిశీలించారు. త్వరగా పనులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. స్థల సేకరణకు పనులు ప్రారంభిస్తామని ఎఫ్ఆర్వో గణేశ్ వెల్లడించారు. ఇందుకోసం ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. ప్రస్తుతం పర్యాటకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రక్షణ చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు.