పాత పెన్షన్​ విధానాన్ని అమలు చేయాలి

  •  ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో నిరసన

ఆదిలాబాద్​టౌన్​, వెలుగు; ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం పాత పెన్షన్​ విధానాన్ని అమలు చేయాలని   ప్రభుత్వ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో ఆదివారం నిరసన వ్యక్తం చేశారు.  పట్టణంలోని టీఎన్​జీఓ   భవనం నుంచి  ఎన్​టీఆర్​  చౌరస్తా వరకు ర్యాలీ తీశారు.  ఆర్​అండ్​బీ గెస్ట్​ హౌస్​ ఎదుట సభ నిర్వహించారు.  

సెప్టెంబర్ 1న  పెన్షన్ విద్రోహ దినం నిర్వహించినట్లు పేర్కొన్నారు అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చట్ల ప్రవీణ్ కుమార్, ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ పాత పెన్షన్ పద్ధతిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్దాక్షిణ్యంగా రూపుమాపాయని, దీని వల్ల  ఉద్యోగస్తులు వారి కుటుంబాలు తీవ్రమైన ఆందోళనకు లోనవుతున్నాయని అన్నారు.   

సీపీఎస్​ రద్దు చేసేదాకా పోరాడుతాం.

మంచిర్యాల  : కంట్రిబ్యూటరీ పెన్షన్​ స్కీమ్​ (సీపీఎస్​) ను రద్దు చేసి ఓల్డ్​ పెన్షన్​ స్కీమ్​ (ఓపీఎస్​)ను పునరుద్ధరించేదాక పోరాడుతామని తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్​ గడియారం శ్రీహరి అన్నారు. సెప్టెంబర్​ 1న పెన్షన్​ విద్రోహ దినంగా పాటిస్తూ ఆదివారం జేఏసీ ఆధ్వర్యంలో మంచిర్యాల ఐబీ చౌరస్తాలో నిరసన చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినట్లు సీపీఎస్​ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన యూనిఫైడ్​ పెన్షన్​ స్కీమ్​ (యూపీఎస్​) అమలుకు ఒప్పుకునేది లేదన్నారు.

సీపీఎస్ ఉద్యోగులు రాష్ట్రవ్యాప్తంగా ఎంతో మంది మృతి చెందారని  వాపోయారు. ఈ కార్యక్రమంలో    నాయకులు  గంగాధర్,  వెంకటేశ్వర్లు, శంకర్ గౌడ్, శ్రీనివాస్ దేశ్​పాండే, లావుడ్య కృష్ణ, బండ శాంకరి, రాస రవి, ఆసంపల్లి రమేశ్​, మోతే జయకృష్ణ, పొన్న మల్లయ్య , శ్రీపతి బాపూరావు, చక్రపాణి, గుర్రాల రాజవేణు, అబ్దుల్ ఎజాజ్,  కే.రాజ్యలక్ష్మి, సుమిత్ పాల్గొన్నారు. 

సీపీఎస్​ను రద్దు చేయాలి : తపస్

మంచిర్యాల : కాంగ్రెస్  ఇచ్చిన హామీ మేరకు కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్​ను రద్దు చేసి ఓల్డ్​ పెన్షన్ స్కీమ్​ను పునరుద్ధరించాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) జిల్లా శాఖ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.

ఆదివారం సంఘం జిల్లా ఆఫీసులో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపిన అనంతరం నాయకులు మాట్లాడారు. జిల్లా ప్రధాన కార్యదర్శి బగ్గని రవికుమార్, రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి బండి రమేశ్, జిల్లా బాధ్యులు నీలేష్ కుమార్, భారతి అశోక్ పాల్గొన్నారు.