గౌరవెల్లికాల్వలకు మోక్షం .. పనులు పూర్తి చేసేందుకు రూ. 431 కోట్లు విడుదల

  • అధ్వానంగా మారిన కుడి కాల్వ, అసంపూర్తిగా ఉన్న ఎడమ కాల్వ
  • నిధుల విడుదలతో టెండర్లు పిలిచేందుకు అధికారుల కసరత్తు

సిద్దిపేట, వెలుగు : హుస్నాబాద్‌‌‌‌‌‌‌‌, స్టేషన్‌‌‌‌‌‌‌‌ ఘన్‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌ నియోజకవర్గాలకు నీరందించే గౌరవెల్లి ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌కు సంబంధించిన కాల్వల పనుల్లో ముందడుగు పడింది. కాల్వల నిర్మాణం నిర్మాణం కోసం సర్కార్ ఇటీవల రూ. 431 కోట్లను విడుదల చేయడంతో అసంపూర్తిగా నిలిచిన పనులు ఎట్టకేలకు మొదలయ్యే అవకాశం ఏర్పడింది. ఎస్సారెస్పీ -ఐఎఫ్‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌సీ ప్యాకేజీ నంబర్‌‌‌‌‌‌‌‌ 7లో భాగంగా గౌరవెల్లి కుడి, ఎడమ కాల్వల నిర్మాణం, సిమెంట్‌‌‌‌‌‌‌‌ లైనింగ్‌‌‌‌‌‌‌‌, మట్టి పనుల నిర్వహణకు నిధులు విడుదల చేస్తూ 2023– 24 ఎస్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌ రేట్ల ప్రకారం టెండర్లు పిలవాలని సర్కార్‌‌‌‌‌‌‌‌ సూచించింది. దీంతో టెండర్ల ఖరారుకు ఆఫీసర్లు కసరత్తు ప్రారంభించారు. 

1.06 లక్షల ఎకరాలకు సాగునీరు

గౌరవెల్లి రిజర్వాయర్‌‌‌‌‌‌‌‌ ద్వారా హుస్నాబాద్, స్టేషన్‌‌‌‌‌‌‌‌ ఘన్‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌ నియోజకవర్గాల్లోని 1.06 లక్షల ఎకరాలకు సాగు నీరు ఇవ్వాలని గత ప్రభుత్వం నిర్ణయించింది. కుడి, ఎడమ కాల్వల ద్వారా హుస్నాబాద్, అక్కన్నపేట మండలాల్లోని 17 గ్రామాలకు, కొహెడలోని 8, చిగురుమామిడిలో 10  గ్రామాలకు, కుడి కాల్వ ద్వారా భీమదేవరపల్లి మండలంలో 12, సైదాపూర్‌‌‌‌‌‌‌‌లో 3, ధర్మసాగర్‌‌‌‌‌‌‌‌లో 13, ఘన్‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌లో 36, జఫర్‌‌‌‌‌‌‌‌గఢ్‌‌‌‌‌‌‌‌, హనుమకొండలో ఒక్కో గ్రామం, రఘునాథపల్లి మండలంలో 4 గ్రామాలకు నీరందించేలా ప్లాన్‌‌‌‌‌‌‌‌ చేశారు. 

ప్రణాళికలు రూపొందించిన ప్రభుత్వం పనులను మాత్రం పట్టించుకోలేదు. గౌరవెల్లి రిజర్వాయర్‌‌‌‌‌‌‌‌ కెపాసిటీని 1.43 టీఎంసీల నుంచి 8.23 టీఎంసీలకు రీ డిజైన్‌‌‌‌‌‌‌‌ చేసినా నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా కాల్వల నిర్మాణం జరుగలేదు. దాదాపు ఏడేండ్ల కింద పాత డిజైన్‌‌‌‌‌‌‌‌ ప్రకారం కుడి, ఎడమ కాల్వల నిర్మాణాన్ని ప్రారంభించినా ఎక్కడా పూర్తి స్థాయిలో పనులు చేయలేదు. గౌరవెల్లి రిజర్వాయర్‌‌‌‌‌‌‌‌ నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వం చెరువులు, కాల్వల్లోకి నీటిని మళ్లించేందుకు ఉద్దేశించిన కాల్వల నిర్మాణంపై దృష్టి సారించింది. కుడి, ఎడమ కాల్వలు పూర్తి చేయడానికి మంత్రి పొన్నం ప్రభాకర్‌‌‌‌‌‌‌‌ చొరవ తీసుకోవడం, ప్రభుత్వం నిధులు విడుదల చేయడంతో అడ్డంకులు తొలగిపోయాయి.

కుడి కాల్వపై కొరవడిన పర్యవేక్షణ

గౌరవెల్లి రిజర్వాయర్ నుంచి 47 కిలో మీటర్లు సాగే కుడి కాల్వ ద్వారా నాలుగు జిల్లాల్లోని 90 వేల ఎకరాలకు నీరందించేలా ప్లాన్‌‌‌‌‌‌‌‌ చేశారు. కానీ పర్యవేక్షణ లోపం కారణంగా ఈ కాల్వ పిచ్చి మొక్కలతో నిండిపోయింది. పాత డిజైన్‌‌‌‌‌‌‌‌ ప్రకారం కుడి కాల్వ పనులను నిర్వహించి సిమెంట్‌‌‌‌‌‌‌‌ లైనింగ్‌‌‌‌‌‌‌‌ పూర్తి చేసిన తర్వాత దానిని పట్టించుకోలేదు. దీంతో లైనింగ్‌‌‌‌‌‌‌‌ పలు చోట్ల దెబ్బతినడంతో పాటు కొన్ని చోట్ల పూర్తిగా కూలిపోయింది. కాల్వ కింది భాగంతో పాటు సిమెంట్‌‌‌‌‌‌‌‌ లైనింగ్ చుట్టూ పిచ్చి మొక్కలు పెరిగిపోయాయి. కుడి కాల్వ మొత్తం 47 కిలోమీటర్ల మేర ఉన్నా పనులు మాత్రం కొంత మేరకే జరిగాయి. ప్రస్తుతం కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ సర్కార్‌‌‌‌‌‌‌‌ నిధులు మంజూరు చేయడంతో కుడి కాల్వ మిగులు పనులతో పాటు పిచ్చి మొక్కల తొలగింపునకు అవకాశం ఏర్పడింది.

అసంపూర్తిగా ఎడమ కాల్వ

హుస్నాబాద్‌‌‌‌‌‌‌‌ నియోజకవర్గంలోని అక్కన్నపేట, హుస్నాబాద్‌‌‌‌‌‌‌‌, కోహెడ మండలాలకు నీటిని తరలించేందుకు ఎడమ కాల్వ నిర్మాణం చేపట్టారు. రిజర్వాయర్‌‌‌‌‌‌‌‌ నుంచి సుమారు 20 కిలో మీటర్ల మేర సాగే ఎడమ కాల్వకు సంబందించి కేవలం మట్టి పనులు మాత్రమే జరిగాయి. దాదాపు ఏడేండ్ల కిందే కాల్వను  తవ్వి వదిలి వేయడంతో వరద నీరు చేరి చెట్లు తుప్పలతో నిండిపోయాయి. రిజర్వాయర్‌‌‌‌‌‌‌‌ నుంచి ప్రారంభమైన ఎడమ కాల్వకు అక్కడక్కడా పనులు చేసి అర్ధంతరంగా వదిలేశారు. కాల్వకు ఎక్కడా కూడా సిమెంట్‌‌‌‌‌‌‌‌ లైనింగ్‌‌‌‌‌‌‌‌ పనులు చేయకపోగా, 
అవసరమైన చోట బ్రిడ్జిలు, కల్వర్టులు సైతం నిర్మించలేదు. కాంట్రాక్టర్‌‌‌‌‌‌‌‌ పనులను మధ్యలోనే వదిలేసి పోయారు.

మూడు కేటగిరీలుగా విభజన

గౌరవెల్లి ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌ రైట్‌‌‌‌‌‌‌‌, లెఫ్ట్‌‌‌‌‌‌‌‌ కెనాల్స్‌‌‌‌‌‌‌‌తో హుస్నాబాద్‌‌‌‌‌‌‌‌ నియోజకవర్గంలోని చెరువులకు సాగునీరు సరఫరా చేసేందుకు అవసరమైన పనులను మూడు కేటగిరీలుగా విభజించారు. గౌరవెల్లి ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌ పనులు 90 శాతం పూర్తి అయినప్పటికీ ఎన్జీటీ కేసు నేపథ్యంలో ప్రారంభానికి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. అయితే కాల్వల నిర్మాణానికి అవసరమైన చర్యలలపై మంత్రి పొన్నం ప్రభాకర్‌‌‌‌‌‌‌‌ ఇటీవల ఆఫీసర్లతో సమావేశాలు నిర్వహించారు. 

సాగునీరు సరఫరా చేసేందుకు  అవసరమైన డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్‌‌‌‌‌‌‌‌ నిర్మాణాలకు అక్కన్నపేట మండలంలో 132 ఎకరాలు, హుస్నాబాద్ మండలంలో 235, కోహెడ మండలంలో 304 ఎకరాల భూ సర్వే పెగ్‌‌‌‌‌‌‌‌ మార్కింగ్‌‌‌‌‌‌‌‌పై ఆఫీసర్లు దృష్టి సారించారు. ఇదే  సమయంలో కోహెడ మెయిన్‌‌‌‌‌‌‌‌ కెనాల్‌‌‌‌‌‌‌‌ వైపు ఎల్కతుర్తి సిద్దిపేట నేషనల్‌‌‌‌‌‌‌‌ హైవే నిర్మాణం జరుగుతున్నందున రోడ్డు క్రాస్ చేసే ప్రాంతాన్ని ముందస్తుగా గుర్తించే పనిలో ఆఫీసర్లు నిమగ్నమయ్యారు.