మెదక్లో గుప్పుమంటున్న గంజాయి.. సీక్రెట్ గా అమ్మకాలు

  • చాక్లెట్ల రూపంలో విక్రయాలు 
  • లక్షల విలువైన సరుకు పట్టివేత
  • కేసులు నమోదవుతున్నా ఆగని రవాణా, అమ్మకాలు 

మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, వెలుగు:  ఉమ్మడి మెదక్ జిల్లాలో గంజాయి గుప్పుమంటోంది. అక్రమార్జనకు అలవాటు పడిన కొందరు ఇతర ప్రాంతాల నుంచి ఎండు గంజాయి తీసుకొచ్చి సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాలో నియమించుకున్న ఏజెంట్లతో అమ్మకాలు సాగిస్తున్నారు. దీంతో కంపెనీల్లో పనిచేసే ఇతర రాష్ట్రాల కూలీలతో పాటు, స్థానిక  యువకులు గంజాయికి అలవాటు పడుతున్నారు. కొందరు బానిసలుగా మారి ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్నారు. గంజాయి సప్లై చేస్తున్న, అమ్ముతున్న వారిపై ఎక్సైజ్, పోలీసులు కేసులు నమోదు చేస్తున్నా గంజాయి రవాణా, అమ్మకాలు మాత్రం ఆగడం లేదు. 

సంగారెడ్డి జిల్లాలో..

జిల్లాలో ఇటీవల పొలాల్లో గంజాయి సాగు చేయడం బాగా పెరిగింది. గడిచిన మూడు నెలల్లో గంజాయి మొక్కల ధ్వంసం, ఎండు గంజాయి రవాణాకు సంబంధించి 13 కేసులు నమోదయ్యాయి. ఎక్కువగా సరిహద్దు రాష్ట్రాలైన కర్నాటక, మహారాష్ట్రకు తరలిస్తుంటారు. కొన్నిసార్లు గంజాయిని చాక్లెట్లుగా మార్చి విక్రయిస్తున్నట్టు తేలింది. ఎన్ ఫోర్స్ మెంట్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులకు సమాచారం ఇచ్చినా పట్టుకోవడంలేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

పట్టుబడిన గంజాయి..

జహీరాబాద్ సమీపంలోని రంజోల్ బై పాస్ క్రాస్ వద్ద మార్చి 31న నేషనల్ హైవే పై వాహనాలను తనిఖీ చేస్తుండగా కోటిన్నర విలువచేసే 70 కిలోల ఎండు గంజాయి పట్టుబడింది. మునిపల్లి మండలం కంకోల్ టోల్ గేటు వద్ద కోటి విలువచేసే ఎండు గంజాయి ప్యాకెట్లు పట్టుబడ్డాయి. ఝరాసంఘం మండలం సిద్ధాపూర్ గ్రామంలో ఏప్రిల్ 2న పొలంలో పెంచుతున్న రూ.8.2 లక్షల విలువ గల గంజాయి మొక్కలను ఎక్సైజ్ అధికారులు ధ్వంసం చేశారు. హత్నూర మండల కేంద్రంలో ఫిబ్రవరి నెలలో రూ.32 లక్షల విలువచేసే ఎండు గంజాయి పట్టుబడింది. బుదేరా హైవేపై మార్చి నెలలో రూ.70 లక్షల విలువచేసే ఎండు గంజాయిని ఎన్​ఫోర్స్​మెంట్​ అధికారులు పట్టుకున్నారు.

మెదక్ జిల్లాలో..

రెండు నెలల క్రితం అల్లాదుర్గం మండలంలో నడిమి తండాకు చెందిన మలత్ మోతీలాల్ వ్యవసాయ క్షేత్రంలో గంజాయి మొక్కలు పెంచుతున్నట్లు సమాచారం అందడంతో ఎక్సైజ్ సీఐ సిబ్బందితో వెళ్లి  రైడ్​ చేశారు. మొక్కలను స్వాధీనం చేసుకొని, నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో విజయ కుమార్ అనే మరో వ్యక్తి ఉన్నట్లు గుర్తించారు. గతంలో కూడా మోతీలాల్, విజయ కుమార్ గంజాయి కేసు నిందితులుగా ఉండి, బెయిల్ పై విడుదలై మళ్లీ గంజాయి సాగు చేపట్టారు.  

మూడు రోజుల కిందట కొల్చారం మండలం పోతం శెట్టిపల్లి వద్ద గంజాయి తాగుతున్న నలుగురు యువకులను పోలీసులు పట్టుకున్నారు. వారిలో ఇద్దరు మెదక్ మండలం చిట్యాల, ఒకరు కొల్చారం మండలం పోతంశెట్టిపల్లి, మరొకరు అప్పాజీపల్లికి చెందిన వారుగా గుర్తించారు. గతంలో శివ్వంపేట, చేగుంట మండలాల్లో, మెదక్ పట్టణంలో ఎండు గంజాయి, మహోహరాబాద్ మండలంలో గంజాయి చాక్లెట్లు పట్టుబడ్డాయి. 

సిద్దిపేట జిల్లాలో.. 

రెండు రోజుల క్రితం పోలీసులు హుస్నాబాద్ లో1,500 గ్రాముల ఎండు గంజాయి పట్టుకొని ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. సిద్దిపేట మండలం లక్ష్మీదేవి పల్లి గ్రామం వద్ద గంజాయి అమ్మకానికి ప్రయత్నిస్తున్న ఐదుగురు యువకులను పట్టుకుని వారి నుంచి 500 గ్రాముల గంజాయిని రూరల్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. త్రీ టౌన్ పోలీసులు కొద్దిరోజుల క్రితం పట్టణ శివార్లలో ముగ్గురు యువకులను పట్టుకుని అక్రమంగా రవాణా చేస్తున్న 500 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మద్దూరు మండలం చుంచనకోట వద్ద గంజాయి అమ్మకానికి ప్రయత్నిస్తున్న ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకొని కిలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. చేర్యాల పట్టణంలో గంజాయి చాక్లెట్లను అమ్ముతున్న బీహార్ వాసిని అరెస్టు చేశారు.