మంచిర్యాలలో గాంజా వార్

మంచిర్యాల, వెలుగు: మంచిర్యాలలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య గంజాయి వార్ ముదిరింది.  సమాజంలో యువతను పట్టిపీడిస్తూ అలజడి రేపుతున్న గంజాయి గ్యాంగ్​లను గతంలో పెంచిపోషించింది మీరంటే.. ఇప్పుడు ప్రోత్సహిస్తున్నది మీరేనంటూ   రెండు పార్టీల నేతలు ఒకరినొకరు  తిట్టుకుంటున్నారు.  మంచిర్యాలలో 2016 నుంచి గంజాయి ​దందా విచ్చలవిడిగా సాగుతోందని, అప్పటి అధికార పార్టీ లీడర్లే ఈ మాఫియాను ఎంకరేజ్ ​చేశారని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్​సాగర్​రావు ఇటీవల మీడియా ముందు ఆరోపించారు. 

మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్​రావు కొడుకు విజిత్​రావుతో పాటు అతడి అనుచరులు యువకులను గంజాయికి బానిసలుగా మార్చి  దాడులకు ఉసిగొల్పారని మండిపడ్డారు.  మంచిర్యాలలో గంజాయి మాఫియాను అంతమొందించడమే తన లక్ష్యమని, దీనికి కారణమైన వారిని వదిలేది లేదని ఎమ్మెల్యే హెచ్చరించారు. ఈ క్రమంలోనే ఇటీవల తన ఇంటిపైన కూడా దాడి జరిగిందన్నారు. ఎమ్మెల్యే కామెంట్లతో రాజకీయ వర్గాల్లో కలకలం మొదలైంది. మరోవైపు ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడే గంజాయి గ్యాంగ్​ను చేరదీసి ప్రతిపక్ష నేతలపై దాడులకు ప్రేరేపిస్తున్నారని, భూ దందాలు, సెటిల్​మెంట్లు చేస్తున్నాడని మాజీ ఎమ్మెల్యే దివాకర్​రావు, బీఆర్ఎస్ ​లీడర్లు ఇటీవల జరిగిన సంఘటనలను ఉదహరిస్తున్నారు. దీంతో గంజాయి వార్​ రాజకీయ రంగు పులుముకుంది. 

విచ్చలవిడిగా గంజాయి

కొంతకాలంగా జిల్లాలో గంజాయి దందా విచ్చలవిడిగా కొనసాగుతోంది. పాన్ ​షాపులు, పండ్ల దుకాణాలు, గల్లీల్లోని కిరాణా షాపుల్లోనూ సరుకు దొరుకుతోంది. కొంతమంది ముఠాలుగా ఏర్పడి మహారాష్ట్ర, చత్తీస్​గఢ్, ఒడిశా, ఏపీతో పాటు రాష్ట్రంలోని భద్రాచలం, మహబూబాబాద్​తదితర ఏజెన్సీ ఏరియాల నుంచి గుట్టుగా తీసుకొచ్చి అమ్ముతున్నారు. చిన్న చిన్న ప్యాకెట్లుగా చేసి రూ.200 నుంచి రూ.500 వరకు సేల్ ​చేస్తున్నారు.  ప్రభుత్వం గంజాయి దందాపై సీరియస్​గా ఉండడంతో పోలీసులు ఇటీవల కొంతవరకు కంట్రోల్​ చేయగలిగారు. ఇప్పటికే చాలామంది పెడ్లర్లను అరెస్టు జైలుకు పంపారు. గంజాయికి అలవాటుపడ్డ వ్యక్తులే ప్రస్తుతం పెడ్లర్లుగా మారి మహారాష్ట్ర నుంచి తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతున్నారని పోలీసులు చెబుతున్నారు. 

గంజాయిపై పోలీసుల ఫోకస్ ​ 

జిల్లాలో గంజాయి మాఫియాపై పోలీసులు ఫోకస్​పెట్టారు. కంట్రోల్​చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు జిల్లాలో 27 గంజాయి కేసుల్లో 82 మందిని అరెస్టు చేయగా, ఎనిమిది మంది పరారీలో ఉన్నట్లు డీసీపీ ఏ.భాస్కర్​తెలిపారు. 65 మందిపై ప్రత్యేక నిఘా కోసం సస్పెక్ట్ షీట్స్ ఓపెన్ చేశామన్నారు. గంజాయికి బానిసలైన 37 మందిని డ్రగ్​డీ -అడిక్షన్ సెంటర్​కు పంపామన్నారు. మరో 194 మందికి వారి ఫ్యామిలీ మెంబర్స్​సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించామని వెల్లడించారు. జిల్లాలో గంజాయిని పూర్తిగా కంట్రోల్​ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

గంజాయి మత్తులో గొడవలు, దాడులు

జిల్లాలో ఎందరో యువకులు గంజాయి మత్తుకు అలవాటుపడి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. మరోవైపు కొంతమంది లీడర్లు యువకులను చేరదీసి గంజాయికి బానిసలుగా మార్చి తమ అవసరాల కోసం వారిని పావులుగా వాడుకుంటున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవల జిల్లాలో గల్లీకో గంజాయి గ్యాంగ్ తయారైంది. ఆ మత్తులో వీరు నిత్యం గొడవలు చేస్తూ, పరస్పర దాడులకు పాల్పడుతున్నారు. వారి ఏరియాల్లో హీరోయిజం చాటుకునేందుకు అమాయకులపై దాడులకు దిగుతున్నారు. భూదందాలు, లవ్ ఎఫైర్లు, రాజకీయ కక్షలు, ఇతర వ్యవహారాల్లో ఈ గ్యాంగ్​ల నడుమ ఆధిపత్య దాడులు పెరుగుతున్నాయి. వీరి ఆగడాలతో సామాన్య ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. శివారు ఏరియాల్లో రాత్రిళ్లు ఒంటరిగా వెళ్లేందుకు జంకుతున్నారు.