భైంసాలో 600 మందితో బందోబస్తు

  • గణేష్​ నిమజ్జనానికి భారీ బందోబస్తు  

భైంసా, వెలుగు : భైంసాలో  ఆదవారం  గణేష్​ నిమజ్జనోత్సవం జరుగనుంది. పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఎస్పీ జానకీ షర్మిల​, ఏఎస్పీ అవినాశ్​​ కుమార్​​ ఆధ్వర్యంలో సుమారు 600 మంది పోలీసులు డ్యూటీ చేయనున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ప్రత్యేక దృష్టి సారించారు. ఇప్పటికే సబ్​ బెటాలియన్​ భైంసాలో ఉండగా.. నిజామాబాద్​, ఆదిలాబాద్​, మంచిర్యాల జిల్లాల నుంచి అదనపు బలగాలను రప్పించారు. పట్టణంలో మొత్తం 150 వినాయక విగ్రహాలు ఉన్నాయి. నేడు గడ్డెన్న ప్రాజెక్టులో నిమజ్జనం చేయనున్నారు.

 మున్సిపల్​ ఆధ్వర్యంలో ప్రాజెక్టు వద్ద అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. శోభాయాత్ర జరిగే మార్గాల్లో ఎల్​ఈడీ లైట్లు ఏర్పాటు చేశారు. గణేష్​ నగర్​లోని సార్వజనిక్​ గణేషునికి ఎస్పీ జానకీ షర్మిలా, ఏఎస్పీ అవినాష్​ కుమార్​​, ఎమ్మెల్యే రామారావు పటేల్​తో పాటు హిందూ ఉత్సవ సమితి సభ్యులు ప్రత్యేక పూజలు చేసి శోభాయాత్ర ప్రారంభిస్తారు. నిమజ్జన శోభాయాత్రను పోలీసు శాఖ సీసీ కెమెరాలతో పర్యవేక్షించనుంది. 

  ఇప్పటికే అడిషనల్​ ఐజీ చంద్రశేఖర్​ రెడ్డి భైంసా గణేష్​ శోభాయాత్రపై ప్రత్యేక దృష్టి సారించారు.    భారీ డీజేలను పెట్టొద్దని ఆదేశించారు. రెండ్రోజుల క్రితం ముథోల్​లో జరిగిన శోభాయాత్రలో  12 డీజేల యాజమానులపై కేసులు నమోదు చేశారు. 

పట్టణంలో మొత్తం 27 పోలీస్​ పికెటింగ్​లు ఏర్పాటు చేశారు. 220 సీసీ కెమెరాలు పెట్టారు. ఒక అడిషనల్​ ఎస్పీ, నలుగురు డీఎస్పీలు, 28 మంది సీఐలు, 41 మంది ఎస్సైలు, 100 మంది హెడ్​ కానిస్టేబుళ్లు, 250 మంది సివిల్​ కానిస్టేబుళ్లు, 300 మంది ట్రైనీ కానిస్టేబుళ్లు విధుల్లో ఉండనున్నారు.