- ఏర్పాట్లు పూర్తిచేసిన ఆలయ కమిటీ
కోల్బెల్ట్, వెలుగు : మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని బొక్కలగుట్ట గాంధారి మైసమ్మ ఆలయంలో ఆదివారం ఆషాఢ మాస బోనాల జాతర నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ముందుగా ఉదయం బొక్కలగుట్ట గ్రామశివారులోని రాళ్లవాగు ఒడ్డున సంప్రదాయబద్దంగా చెట్టుకు పూజలు చేసిన అమ్మవారిని ఊరేగింపుగా ఆలయం వద్దకు తీసుకొని రావడంతో వేడుకలు ప్రారంభమవుతాయి.
ఆషాఢ మాసంలో మైసమ్మ తల్లికి బోనాలు సమర్పిస్తే మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం. జాతర సందర్భంగా భక్తులు వన భోజనాల కార్యక్రమాలను చేపడుతారు. వేడుకల్లో చెన్నూర్ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి తదితరులు పాల్గొననున్నారు.
ఏర్పాట్లను పరిశీలించిన డీసీపీ
బోనాల జాతర ఏర్పాట్లను శనివారం మంచిర్యాల డీసీపీ భాస్కర్, బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్, మందమర్రి సీఐ శశీధర్రెడ్డిపరిశీలించారు. వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు రానుండడం, నేషనల్ హైవేను ఆనుకొని జాతర జరగనుండడంతో ట్రాఫిక్ పరంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని పోలీసులను డీసీపీ ఆదేశించారు.
బెల్లంపల్లి ఏసీపీ ఆధ్వర్యంలో ముగ్గురు సీఐలు, 20 ఎస్ఐలు, 250 మంది పోలీసులు సిబ్బంది బందోబస్తు చేపడుతారని డీసీపీ తెలిపారు. ఆలయం పక్కన రాళ్లవాగు ఉధృతంగా ప్రవహిస్తోందని, భక్తులు అటువైపు వెళ్లవద్దని సూచించారు.