ఏసీబీకి చిక్కిన జూనియర్‌‌ అసిస్టెంట్ .. రూ.10 వేలు లంచం తీసుకుంటుండగా పట్టివేత

నిర్మల్, వెలుగు : నిర్మల్‌‌ జిల్లా సర్వే అండ్‌‌ ల్యాండ్‌‌ రికార్డ్స్‌‌ ఆఫీస్‌‌లో జూనియర్‌‌ అసిస్టెంట్‌‌గా పనిచేస్తున్న గాదరి జగదీశ్, బినామీ అటెండర్‌‌గా పనిచేస్తున్న ప్రశాంత్‌‌ శుక్రవారం ఏసీబీ ఆఫీసర్లకు పట్టుబట్టారు. రూ. 10 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ ఆఫీసర్లు రెడ్‌‌హ్యాండెడ్‌‌గా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి తెలిపిన వివరాల ప్రకారం... నిర్మల్‌‌ పట్టణంలోని బుధవారపేటకు చెందిన హరీశ్‌‌ మామడ మండలం ఆదర్శనగర్‌‌ గ్రామంలోని 17/3 సర్వే నంబర్‌‌లో భూమిని కొనుగోలు చేశాడు. 

ఈ భూమికి సంబంధించిన సేత్వార్‌‌, టోంచు మ్యాప్‌‌ల కోసం సర్వే అండ్‌‌ ల్యాండ్‌‌ రికార్డ్స్‌‌ ఆఫీస్‌‌లో పనిచేసే జూనియర్‌‌ అసిస్టెంట్‌‌ జగదీశ్‌‌ను సంప్రదించగా రూ. 10 వేలు ఇవ్వాలని డిమాండ్‌‌ చేశాడు. దీంతో హరీశ్‌‌ ఏసీబీ ఆఫీసర్లను ఆశ్రయించాడు. వారి సూచనతో శుక్రవారం సర్వే అండ్‌‌ ల్యాండ్‌‌ రికార్డ్స్‌‌ ఆఫీస్‌‌లో అటెండర్‌‌ ప్రశాంత్‌‌కు రూ. 10 వేలు ఇచ్చాడు. అతడు జూనియర్‌‌ అసిస్టెంట్‌‌ జగదీశ్‌‌కు డబ్బులు అందజేశాడు. అప్పటికే అక్కడ ఉన్న ఏసీబీ ఆఫీసర్లు ఇద్దరిని రెడ్‌‌హ్యాండెడ్‌‌గా పట్టుకున్నారు. అటెండర్‌‌గా ప్రశాంత్‌‌ భార్య పనిచేయాల్సి ఉండగా ఆమెకు బినామీగా అతడు పనిచేస్తున్నాడు. ఇద్దరిని అరెస్ట్‌‌ చేసి కరీంనగర్‌‌ ఏసీబీ కోర్టులో హాజరుపరిచినట్లు డీఎస్పీ తెలిపారు.