మళ్లీ పైసలు తెస్తున్న ఎఫ్​పీఐలు..2 వారాల్లో రూ. 22,766 కోట్ల పెట్టుబడులు

న్యూఢిల్లీ: యూఎస్​ ఫెడ్​ వడ్డీరేట్ల తగ్గింపు అంచనాలతో విదేశీ ఇన్వెస్టర్లు డిసెంబరు మొదటి రెండు వారాల్లో  నికరంగా రూ. 22,766 కోట్లను భారతీయ ఈక్విటీల్లో పెట్టారు.  విదేశీ పోర్ట్‌‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌‌పీఐలు) నవంబర్‌‌లో రూ. 21,612 కోట్లు,  అక్టోబర్‌‌లో భారీగా రూ. 94,017 కోట్లను ఉపసంహరించుకున్నారు.  ఆసక్తికరమైన విషయమేమిటంటే, సెప్టెంబరులో ఎఫ్‌‌పీఐ ఇన్‌‌ఫ్లోల తొమ్మిది నెలల గరిష్టానికి చేరింది. ఆ నెలలో నికర పెట్టుబడి రూ. 57,724 కోట్లుగా నమోదయింది.  తాజా ఇన్‌‌ఫ్లోతో, 2024లో ఇప్పటి వరకు ఎఫ్‌‌పీఐ పెట్టుబడులు రూ.7,747 కోట్లకు చేరుకున్నాయి. 

 ఇక ముందు,  భారతీయ ఈక్విటీ మార్కెట్లలోకి విదేశీ పెట్టుబడుల ప్రవాహం అనేక కీలక అంశాలపై ఆధారపడి ఉంటుంది. డొనాల్డ్ ట్రంప్ విధానాలు, ప్రస్తుత ద్రవ్యోల్బణం,  వడ్డీ రేటు వాతావరణం, భౌగోళిక రాజకీయ పరిస్థితులను బట్టి ఎఫ్​పీఐలు నిర్ణయాలు తీసుకుంటారని మార్నింగ్‌‌స్టార్ ఇన్వెస్ట్‌‌మెంట్ రీసెర్చ్ ఇండియా మేనేజర్ రీసెర్చ్ అసోసియేట్ డైరెక్టర్ హిమాన్షు శ్రీవాస్తవ తెలిపారు. భారతీయ కంపెనీల మూడో క్వార్టర్​ ఆదాయాల పనితీరు,  ఆర్థిక వృద్ధి విషయంలో దేశం పురోగతి పెట్టుబడిదారుల సెంటిమెంట్‌‌ను ప్రభావితం చేస్తాయని ఆయన తెలిపారు. ఈ నెలలో (డిసెంబర్ 13 వరకు) ఎఫ్‌‌పీఐలు రూ.22,766 కోట్లు ఇండియా మార్కెట్లో ఇన్వెస్ట్​ చేశారు.