చైన్‌‌ లింక్‌‌ బిజినెస్‌‌ చేస్తున్న నలుగురు అరెస్ట్‌‌.. నిందితుల్లో ఎస్సై, కానిస్టేబుల్

నిర్మల్, వెలుగు: క్రిప్టో కరెన్సీ, బిట్‌‌ కాయిన్స్‌‌ పేరుతో చైన్‌‌ లింక్‌‌ సిస్టమ్‌‌లో పెట్టుబడి పెట్టిస్తున్న నలుగురు వ్యక్తులను నిర్మల్‌‌ పోలీసులు అరెస్ట్‌‌ చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను ఎస్పీ జానకీ షర్మిల ఆదివారం వెల్లడించారు. ఆమె తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలో ఎవరి నోట విన్నా చైన్‌‌ లింక్‌‌ సిస్టమ్‌‌ ద్వారా క్రిప్టో కరెన్సీ, బిట్‌‌ కాయిన్‌‌ బిజినెస్‌‌ పేర్లు వినిపిస్తుండడంతో సమాచారం అందుకున్న ఎస్పీ జానకీ షర్మిల ఈ వ్యవహారంపై ఫోకస్‌‌ చేశారు. ఈ బిజినెస్‌‌ వివరాలు తెలుసుకునేందుకు అడిషనల్‌‌ ఎస్పీ అవినాశ్‌‌కుమార్‌‌ నేతృత్వంలో ప్రత్యేక టీంను ఏర్పాటు చేశారు. 

విచారణ చేసిన పోలీసులు నిర్మల్‌‌ ప్రాంతంలో ఈ బిజినెస్‌‌ విస్తరణకు కీలకంగా వ్యవహరిస్తున్న కడెం మండలం నవాబుపేట గ్రామానికి చెందిన సల్ల రాజ్‌‌కుమార్‌‌ను అదుపులోకి తీసుకొని ఎంక్వైరీ స్టార్ట్‌‌ చేశారు. దీంతో బిట్‌‌ కాయిన్‌‌ ఆన్‌‌లైన్‌‌ బిజినెస్‌‌లో పెట్టుబడి పెడితే 500 రోజుల్లో 5 నుంచి 10 రెట్లు ఎక్కువ వస్తాయని ప్రజలకు చెబుతూ చైన్‌‌ లింక్‌‌ సిస్టమ్‌‌లో పెట్టుబడి పెట్టిస్తున్నట్లు రాజ్‌‌కుమార్‌‌ పోలీసులకు వివరించారు. నాన్‌‌ వర్కింగ్‌‌ ఇన్‌‌కం స్టేకింగ్‌‌ బోనస్‌‌, వర్కింగ్‌‌ ఇన్‌‌కం రిఫరల్‌‌ బోనస్‌‌, 100 లెవెల్‌‌ బోనస్‌‌, 50 లెవెల్‌‌ బోనస్‌‌, లీడర్‌‌ షిప్‌‌ బోనస్‌‌ పేరుతో ఎంత ఎక్కువ మందిని జాయిన్‌‌ చేస్తే అంత ఎక్కువ బోనస్‌‌ వస్తుందంటూ ఉద్యోగులు, పేద, మధ్య తరగతి ప్రజలతో పెట్టుబడి పెట్టించినట్లు రాజ్‌‌కుమార్‌‌ పోలీసులకు తెలిపారు. 

రాజ్‌‌కుమార్‌‌ ఇచ్చిన సమాచారంతో ఇదే విధంగా పెట్టుబడి పెట్టిస్తున్న కడెం మండలం గంగాపూర్‌‌కు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు కండెల నరేశ్‌‌, ఎక్సైజ్‌‌ ఎస్సై గంగాధర్‌‌, ఏఆర్‌‌ కానిస్టేబుల్‌‌ మహేశ్‌‌లతో పాటు సాయికిరణ్‌‌ అనే వ్యక్తిని అరెస్ట్‌‌ చేసినట్లు ఎస్పీ తెలిపారు. ఈ వ్యాపారానికి ఎలాంటి గుర్తింపు లేదని, పెట్టుబడిగా పెట్టిన డబ్బులు దుర్వినియోగం అవుతాయని ఎస్పీ చెప్పారు. ఇలాంటి బిజినెస్‌‌లో పెట్టుబడులు పెట్టి నష్టపోవద్దని సూచించారు. ఇలాంటి బిజినెస్‌‌ పేరుతో ఎవరైనా వస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. కేసులో ప్రతిభ చూపిన ఏఎస్పీ అవినాశ్‌‌ కుమార్‌‌, డీఎస్పీ గంగారెడ్డి, నిర్మల్‌‌ టౌన్‌‌ ఇన్‌‌స్పెక్టర్‌‌ ప్రవీణ్‌‌కుమార్‌‌, నిర్మల్‌‌ రూరల్‌‌ ఇన్‌‌స్పెక్టర్‌‌ రామకృష్ణ, ఎస్సైలు సాయి కృష్ణ, ఎం.రవి, రవీందర్‌‌, సిబ్బందిని ఎస్పీ అభినందించారు.