భైంసా, వెలుగు: ‘అప్పటి ప్రభుత్వం, పెద్దల ఆదేశాలు కాదనలేక అప్పో సప్పో చేసి ప్రగతి పనులు చేపట్టాం.. పంచాయతీలను ఎంతో అభివృద్ధి చేశాం.. ఇప్పటికీ బిల్లులు రాక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాం’ అని మాజీ సర్పంచ్లు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం భైంసాలో ఆందోళన చేపట్టారు. ర్యాలీగా వెళ్లి ఆర్డీవో ఆఫీస్ ముందు ముందు భైఠాయించి ధర్నా చేశారు. అనంతరం ఆర్డీవో కోమల్ రెడ్డికి వినతి పత్రం ఇచ్చి మాట్లాడారు.
ప్రభుత్వాలు గ్రామ పంచాయతీలకు సంబంధించిన బిల్లుల చెల్లింపులో నిర్లక్ష్య ధోరణి అవలంభిస్తున్నాయని మండిపడ్డారు. ఉన్నతాధికారుల ఆదేశాలకు అనుగుణంగా పనులు చేపట్టామని, ఇందుకు అప్పులు చేసి వాటికి వడ్డీలు కట్టలేకపోతున్నామన్నారు. కుటుంబ పోషణ కూడా భారమైందని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి తమ బాధలు అర్థం చేసుకొని పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.