పెండింగ్ బిల్లులు ఇవ్వకుంటే ఎన్నికలను అడ్డుకుంటం

  • నిర్మల్ కలెక్టరేట్ ముందు బైఠాయించి మాజీ సర్పంచ్ ల ధర్నా 

నిర్మల్, వెలుగు : తమ పెండింగ్ బిల్లులు చెల్లించాలని మాజీ సర్పంచ్ లు సోమవారం నిర్మల్ కలెక్టరేట్ వద్ద ధర్నాకు దిగారు. వంద మందికి పైగా మాజీ సర్పంచ్ లు అక్కడికి చేరుకొని బైఠాయించారు. ప్ల కార్డులు పట్టుకుని తమ పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు. సర్పంచ్ ల ఆత్మహత్యలు నివారించాలని కోరారు. 

దాదాపు గంటకు పైగా ధర్నా చేశారు. అనంతరం మాజీ సర్పంచ్ ల సంఘం నేతలు మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో అప్పులు చేసి గ్రామాల్లో అభివృద్ధి పనులు చేశామని, బిల్లులు ఇవ్వకుండా తమను హింసించిందని ఆరోపించారు. ఇప్పటికే పలువురు సర్పంచ్ లు అప్పుల పాలై ఆత్మహత్యలకు పాల్పడ్డారని వాపోయారు.  ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. తమ బిల్లులు చెల్లించకుంటే రాబోచే సర్పంచ్ ఎన్నికలను అడ్డుకుంటామని వారు హెచ్చరించారు.