- మద్దతు పలికిన మాజీ ఎమ్మెల్యే కోనప్ప, కౌన్సిలర్లు
కాగజ్ నగర్, వెలుగు: ఎస్పీఎం పేపర్ కంపెనీ యాజమాన్యం వైఖరికి నిరసనగా ఈనెల 5 నుంచి సమ్మె చేస్తున్న కాగజ్ నగర్ లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు, సభ్యులు మంగళవారం తమ కుటుంబాలతో కలిసి సమ్మెలో పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప తన సతీమణి రమాదేవితో కలిసి వచ్చి వారికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా కోనప్ప మాట్లాడుతూ.. లారీ ఓనర్లకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
వారి సమస్యను పరిష్కరించే విషయంలో కంపెనీ యాజమాన్యం చర్చలు జరపాలని, సమస్య తీవ్రతరం కాకముందే వారి న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని కోరారు. మూతబడిన కంపెనీని కాగజ్ నగర్ ప్రజల మేలు కోసం తెరిపించామని గుర్తుచేశారు.
అసోసియే షన్ అధ్యక్షుడు వెన్న కిషోర్ బాబు మాట్లాడుతూ జేకే పేపర్ మిల్ యాజమాన్యం దేశంలోని ఇతర ట్రాన్స్పోర్ట్ కంపెనీల విధానానికి భిన్నంగా వ్యవహరిస్తోందని, స్థానిక లారీ ఓనర్స్ పట్ల దౌర్జన్యం చేస్తోందని ఆరోపించారు.
తమ డిమాండ్లు న్యాయమైనవేనని, కంపెనీ మీద చర్యలు తీసుకునేందుకు అధికారులు ఎందుకు వెనుకడుగు వేస్తున్నారని ప్రశ్నించారు. మున్సిపల్ మాజీ చైర్మన్ దస్తగీర్, జడ్పీ కో ఆప్షన్ మాజీ మెంబర్ సిద్దిక్, మున్సిపల్ కౌన్సిలర్లు పాల్గొన్నారు...