తెలంగాణలో రివర్స్ గేర్ లో కాంగ్రెస్ పాలన : హరీశ్​రావు

తూప్రాన్, రామాయంపేట, వెలుగు: రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన రివర్స్ గేర్ లో ఉందని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. ఆదివారం ఆయన మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డితో కలిసి తూప్రాన్ మున్సిపల్ పట్టణ కేంద్రంలో జరిగిన మీటింగ్ లో పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ పాలనలో కరెంట్ సమస్య మళ్లీ మొదలైందన్నారు. అసెంబ్లీ ఎలక్షన్స్​కు ముందు ఇచ్చిన హామీల్లో ఒక్కటీ నెరవేర్చలేక దొంగ మాటలు మాట్లాడుతున్నారన్నారు. 

అదే బీఆర్ఎస్ ప్రభుత్వంలొ కేసీఆర్  కరోన కష్టకాలంలో  కూడా రైతు బంధు వేశారని గుర్తుచేశారు. మహిళలకు రూ.2500 ఇస్తామన్న కాంగ్రెస్ ఇప్పుడు ఆ మాటే మాట్లాడడం లేదన్నారు. తూప్రాన్ లో ఉన్న కొందరు మున్సిపల్ కౌన్సిలర్లు వారి పైరవీల కోసమే  కాంగ్రెస్ లో చేరారని ఆరోపించారు.  బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే తూప్రాన్ అభివృద్ధి జరిగిందని కాంగ్రెస్ నాయకులు చెప్పే జూటా మాటలు నమ్మొద్దన్నారు.

 పార్లమెంట్​లో తప్పులను ప్రశ్నించే గొంతుగా బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని భారీ మెజార్టీతో గెలించాలన్నారు. దేవుడి పేరుతో రాజకీయం చేసే బీజేపీ వాళ్లని నమ్మొద్దన్నారు. బీజేపీకి ఓటేస్తే చెత్తలో వేసినట్లేనన్నారు. గజ్వేల్ నియోజకవర్గానికి  పూర్వ వైభవం రావాలంటే బీఆర్ఎస్ కి ఓటు వేసి గెలిపించాలన్నారు. అనంతరం రామాయంపేటలో నిర్వహించిన కార్యక్రమంలోపాల్గొన్నారు. కార్యక్రమంలో ఎఫ్డీసీ మాజీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, రవీందర్ గౌడ్, రాణి సత్యనారాయణ గౌడ్, సతీశ్ చారి, ఆంజనేయులుగౌడ్, బబుల్ రెడ్డి, మండల బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.