జిల్లాల రద్దుకు ముఖ్యమంత్రి ప్లాన్ : మాజీ సీఎం కేసీఆర్

  • మెదక్ జిల్లా కాపడేందుకు యుద్దం చేద్దాం
  • మెదక్ కార్నర్ మీటింగ్ లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్

మెదక్, వెలుగు:  ముఖ్యమంత్రి జిల్లాలను తీసేస్తాం అంటున్నాడు. మెదక్ జిల్లా కూడా తీసేస్తారు. మెదక్ జిల్లా ఉండాలంటే బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలి. మెదక్ జిల్లా కాపాడుకునేందుకు యుద్దం చేద్దామా' అని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి మద్దతుగా మంగళవారం రాత్రి మెదక్ పట్టణంలోని రాందాస్ చౌరస్తా లో జరిగిన  కార్నర్ మీటింగ్ లో ఆయన ప్రసంగించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా ఏం చేయకపోగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో అభివృద్ధి పనుల కోసం మంజూరు చేసిన నిధులను రద్దు చేస్తోందని విమర్శించారు. ఏడుపాయల అభివృద్ధికి రూ.100 కోట్లు, మెదక్ మున్సిపాలిటీ అభివృద్ధి కి రూ.50 కోట్లు, రామాయంపేట మున్సిపాలిటీ అభివృద్ధి కి రూ.25 కోట్లను తాను మంజూరు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాటిని రద్దు చేసిందని ఆరోపించారు. మెదక్ కు 100 పడకల మెడికల్ కాలేజీ మంజూరు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం దానిని 50 పడకలకు కుదించిందన్నారు. గతంలో టీడీపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు ఘనపూర్ ఆనకట్టను నాశనం చేస్తే తమ ప్రభుత్వం రూ.150 కోట్లతో ఆనకట్ట ఎత్తు పెంచి బ్రహ్మాండంగా అభివృద్ధి చేశామన్నారు. అలాగే  మెదక్ జిల్లాతో పాటు, రామాయంపేట రెవెన్యూ డివిజన్ మంజూరు చేశానని గుర్తు చేశారు. 

మెదక్ లో కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలిచిండు కదా..

ఐదునెల్ల కిందటి దాకా తెలంగాణ ఎలా ఉండే ఇప్పుడెలా అయ్యింది అని కేసీఆర్​ప్రశ్నించారు. ఇచ్చిన హామీల్లో ఒక్కటీ సరిగ్గా అమలు చేయలేదని, ఉచిత బస్సు హామీ ఒక్కటీ  అమలు చేశారు కానీ మహిళలు బస్సుల్లో కొట్టుకుసస్తున్నారని ఎద్దేవా చేశారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్ లో కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలిచిండు కదా అయినా రైతులకు రైతు బంధు,  మహిళలకు రూ.2,500  వచ్చాయా అని ప్రశ్నించారు.  

మోదీలాగే రఘునందన్ రావు గ్యాస్ కొడుతుండు..

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీలాగే మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు సైతం గ్యాస్ కొడుతున్నారని కేసీఆర్​విమర్శించారు. దుబ్బాక అసెంబ్లీ ఎన్నికల్లో చెల్లని  నాణెం మెదక్ ఎంపీ ఎన్నికల్లో చెల్లుతుందా అన్నారు. రఘునందన్ రావును తుక్కుతుక్కుగా ఓడించి బుద్ధి చెప్పాలన్నారు. విద్యావంతుడు, రిటైర్డు ఐఏఎస్​ఆఫీసర్, మూడు జిల్లాల కలెక్టర్ గా పని చేసిన అనుభవం ఉన్న వెంకట్రామిరెడ్డిని ఎంపీగా గెలిస్తే ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి జరుగుతుందన్నారు. సభలో మాజీ మంత్రి హరీశ్ రావు, ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్యే   కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డి, బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఫరూఖ్ హుస్సేన్, దేవేందర్​రెడ్డి, మల్లికార్జున్ గౌడ్, జగపతి పాల్గొన్నారు.