కవ్వాల్ టైగర్ జోన్​లో ఫారెస్ట్‌ మార్చ్‌

  • జిల్లాలోనే మొదటిసారి 
  • స్మగ్లింగ్​ కట్టడికి అధికారుల యత్నం

జన్నారం రూరల్, వెలుగు: కవ్వాల్‌ టైగర్‌ జోన్‌ పరిధిలో విలువైన టేకు కలపను అక్రమంగా తరలిస్తూ పలువురు స్మగ్లర్లు సొమ్ము చేసుకుంటున్నారు. అటవీ శాఖకు తలనొప్పిగా మారిన స్మగ్లింగ్‌ను కంట్రోల్​ చేయడానికి అధికారులు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. స్మగ్లర్లు అధికారుల ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ వారి కండ్లుగప్పి కలపను తరలిస్తున్నారు. ఈ స్మగ్లింగ్‌ అరికట్టడానికి, స్మగ్లర్ల పనిపట్టడానికి ఫారెస్ట్​ ఆఫీసర్లు కొత్త పద్ధతులు అవలంభిస్తున్నారు. ఈ క్రమంలో జన్నారం డివిజన్​ ఇందన్‌పల్లి  రేంజ్‌లో ఎఫ్​ఆర్​వో కారం శ్రీనివాస్‌ కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. రేంజ్‌ పరిధిలో సిబ్బందితో కలిసి ఫారెస్ట్‌ మార్చ్​ నిర్వహిస్తున్నారు. జిల్లాలోనే ఇక్కడ మొదటిసారిగా ప్రారంభించారు. 

ఫారెస్ట్‌ మార్చ్‌ అంటే..

ఫారెస్ట్‌ మార్చ్​లో భాగంగా అడవిలో స్మగ్లింగ్​ను కంట్రోల్​ చేయడానికి ముందస్తుగా తనిఖీలు చేస్తున్నారు. రేంజ్‌ పరిధిలోని సిబ్బంది మూకుమ్మడిగా అటవీ ప్రాంతంలోకి వెళ్లి ఒక బీట్​ను ఎంచుకుని ఆ ప్రాంతాన్ని క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు. ఆ ఏరియాలోని అన్ని కంపార్ట్​మెంట్లలో తనిఖీలు చేపడుతూ నరికివేతకు గురైన చెట్ల వివరాలు సేకరిస్తున్నారు.  నరికివేతకు కారణాలు తెలుసుకొని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు. పడిపోయిన కలప ఉంటే టింబర్‌ డిపోకు తరలిస్తున్నారు.ఇలా ప్రతి వారం ఫారెస్ట్​లో పరేడ్‌ నిర్వహిస్తున్నారు. వారానికోసారి బీట్ల వారీగా ఫారెస్ట్‌ మార్చ్‌ చేపడుతున్నట్లు రేంజ్‌ఆఫీసర్​ 
కారం శ్రీనివాస్‌ తెలిపారు. 

స్మగ్లింగ్‌ను అరికట్టడమే లక్ష్యం 

అడవులు, వన్యప్రాణుల రక్షణ విషయంలో సిబ్బంది అప్రమత్తంగా ఉండటానికి పారెస్ట్‌ మార్చ్‌ ప్రారంభించాం. సిబ్బంది ఎల్లవేళలా అలర్ట్​గా, అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం వన్యప్రాణులను రక్షిస్తూనే అభివృద్ధి పనులతో పాటు స్మగ్లింగ్‌ నిరోధమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. - కారం శ్రీనివాస్, ఎఫ్​ఆర్వో, ఇందన్​పల్లి